కార్పొరేషన్, జనవరి 29: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవమిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో సహాయ ఉపకరణాలు అందజేస్తున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గతంలో దివ్యాంగులు రూ. 500 పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ సర్కారు నెలనెలా ఠంఛన్‌గా రూ. 3016 పింఛన్ అందిస్తున్నదని చెప్పారు. అలాగే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు నేరుగా ఇంటివద్దే పరికరాలు అందేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. ఉపకరణాల కోసం జిల్లావ్యాప్తంగా 1030 ఆన్లైన్ దరఖాస్తులు రాగా రూ.1.92 కోట్లతో ఉపకరణాలను అందజేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు సుమారు రూ. 60 లక్షలతో 152 ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం జిల్లాలో 21 వేల మంది దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తుందని తెలిపారు.
2016 దివ్యాంగుల హకుల చట్టం కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం భవనం నిర్మించాలని కోరారు. డబుల్బెడ్రూం ఇండ్లల్లో 5 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం లబ్ధ్దిదారులకు 14 రిట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికిళ్లు, 7 బ్యాటరీ వీల్ చైర్స్, 6 ల్యాప్‌టాప్‌లు, రెండు 4జీ స్మార్ట్ఫోన్లు, 105 బ్యాటరీ ట్రై సైకిళ్లు, 8 ట్రై సైకిళ్లు, 6 టీచర్ లెర్నింగ్ మెటిరియల్ (టీఎల్ఎం), 4 వీల్ చైర్లు, దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్‌రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.