తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు, ఆడబిడ్డల ఆటపాటలతో నేలతల్లి పులకించిపోయింది.. పల్లె.. పట్నాల్లోని ప్రధాన కూడళ్లు ఆటపాటలతో జాతరలను తలపించాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలు కాగా, రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. సాయంత్రం ప్రధాన కూడళ్లకు చేరుకుని ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలతో హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటలు, కాలువలు, ఘాట్ల వద్ద నిమజ్జనం చేసి, ‘పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు.. కాగా, కరీంనగర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా బతుకమ్మ పేర్చగా, మరో మంత్రి గంగుల కమలాకర్ వేడుకల్లో పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 3: సద్దుల సంబురాలు సోమవారం జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి, ఆటాపాటలతో హోరెత్తించారు. వందలాది మంది ఒక్కచోట చేరి ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాల్వలతోపాటు ఏర్పాటు చేసిన తెప్పల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘కొత్త సిబ్బి.. పాత సిబ్బి’ అంటూ సత్తులు పంచుకొని తిన్నారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సద్దుల సంబురాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోని తన నివాసంలో సతీమణి స్నేహలత, కూతురు నందినితో కలిసి బతుకమ్మను స్వయంగా పేర్చి, అలంకరించారు. మరో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని పలు చోట్ల జరిగిన వేడుకలకు హాజరయ్యారు. మానకొండూర్‌లో వేడుకలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంకలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఇల్లందకుంటలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు వద్ద జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.