కరీంనగర్లో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం
ధర్మపురి,జనవరి29: ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందుకుసాగుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లోని అన్విత గార్డెన్స్‌లో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఉద్యమాల నుంచి పుట్టిందని, అలాంటి పార్టీలో పనిచేస్తున్న వారందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. వారానికి రెండు సార్లు రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామ కమిటీల సమావేశాలు నిర్వహించాలని కోరారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చలు చేయాలని, సమస్యలుంటే తనదృష్టికి తీసుకురావాలని చెప్పారు. నాయకులు విబేధాలకు తావివ్వకుండా మసలుకోవాలన్నారు. అంకితభావంతో పనిచేసేవారికే గుర్తింపు దక్కుతుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని మరింతబలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.