వేములవాడ రూరల్, ఆక్టోబర్ 2 : ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిదని, వాటి విలువ వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం 36 మంది మధ్య మానేరు నిర్వాసితులకు రూ. 4 కోట్ల నష్ట పరిహారాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ మూడు రోజుల క్రితమే ఆరెపల్లి, సంకెపల్లి నిర్వాసితులకు 190 మందికి దాదాపు రూ. 25 కోట్లను, 90 మందికి పట్టాలను అందజేశామని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో మిగిలి ఉన్న ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కొంత ఆలస్యమైనా అందరికీ న్యాయం చేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వా త ప్రధానమైనటువంటి సమస్యలు ఒకటి మిడ్‌మానేరు, ముంపు గ్రామాల సమస్య, ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, కలికోట సూరమ్మ ప్రాజెక్టు చెరువు పనులను పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని, దానికి అనుగుణంగానే ప్రభుత్వంతో మాట్లాడి తన శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిన వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రసుత్తం రూ. 33 కోట్ల పరిహారం మంజూరుకు సహకరించిన మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిడ్‌మానేరు నిర్వాసితుల కన్నీళ్లు తుడవడానికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల యువత కోసం ప్రత్యేకంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రూ 700 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు రాబోతున్నదని, దీనితో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కలుగుతుందన్నారు.
త్వరలోనే మిగిలిపోయిన నిర్వాసితులు సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి పరిహారాన్ని స్థానిక జిల్లా మంత్రి కేటీఆర్ సహకారంతో అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచ్ రంగు సత్తవ్వ, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, ఎంపీటీసీ దేవరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఉపసర్పంచ్ శ్రీనివాస్, టిఆర్ఎస్ మండలాధ్యాక్షుడు ఊరడి ప్రవీణ్, ప్యాక్స్ చైర్మన్ కృష్ణదేవరావు, సర్పంచులు రాంరెడ్డి, రాణి, స్వయంప్రభ, రా జేశం, రంగు రాములు, ఇటిక్యాల రాజు ఉన్నారు.