గోదావరిఖని, జనవరి 28 : సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఏరియా దవాఖానలో సివిల్ డిపార్ట్మెంట్ ద్వారానే వివిధ విభాగాలకు టెండర్లు పిలవాలని సింగరేణి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కనుకుల మొండయ్య, రంగ కిరణ్, బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీరగంటి నరేందర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం కే నారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక సింగరేణి ఏరియా దవాఖానలో గతంలో సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో పని చేసేవారిని కొన్ని విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క టెండర్‌ను పిలిచేవారని తెలిపారు. ఎన్ని విభాగాలకు టెండర్లు వేస్తే అంతమంది కాంట్రాక్టర్లకు ఉపాధి లభించేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేజ్ డిపార్ట్మెంట్కు మార్పు చేసి అన్ని విభాగాలకు సంబంధించి రూ.3 కోట్లకు పైగా ఒకే టెండర్‌ను పిలవడంతో ఒక కాంట్రాక్టర్‌కు మాత్రమే అవకాశం దొరుకుతుందని, దీంతో మిగతా కాంట్రాక్టర్లు జీవనోపాధి కోల్పోతున్నారని జీఎంకు వివరించారు. దీనికి జీఎం స్పందిస్తూ.. గతంలో మాదిరిగానే సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా విభాగాలకు టెండర్లు పిలిచేలా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టర్లు రాంరెడ్డి, కుర్మా సతీశ్, రాయలింగు, రాజమౌళి, మారం సమ్మయ్య, సదానందం, నాగేశ్వరరావు ఉన్నారు.