దేశ రాజకీయాల్లో జ్ఞానవంతులైన నాయకుల లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చడంలో విజయవంతమయ్యారు. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన పనిచేశారు. కాబట్టి, ఆయనకు ప్రతి ఒక్క విషయం తెలుసు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన చేపట్టారు. ఒకవైపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే దాని ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాల్సినవి అందేలా చూస్తూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. అదే సమయంలో అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ఇలా దేశంలోని పౌరులందరికీ సమానమైన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలో అత్యధికంగా వ్యవసాయంపై కార్మిక, కర్షక వర్గాలే అత్యధికంగా ఆధారపడి ఉంటాయి. అలాంటి వారి చూపంతా నేడు తెలంగాణలో అమలవుతున్న పథకాలపై పడింది. ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇలాంటి నాయకత్వం దేశానికి చాలా అవసరం. ఆ వెలితి జాతీయ రాజకీయాల్లో ఉంది కాబట్టి సీఎం కేసీఆర్ భారత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశానికి గొప్ప మేలు కలుగుతుంది.
కరీంనగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయంపై పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు, అక్రమాలకు, అడ్డుకట్ట వేసి.. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథాన ముందుకు తీసుకెళ్తామని ఉద్యమ సమయంలో చెప్పిన నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన ఎనిమిదేండ్లలో ఒక్కో ప్రగతి మెట్టు ఎక్కుతూ వచ్చారు. వినూత్న ఆలోచనలు చేసి, విప్లవాత్మక పథకాలు ప్రవేశ పెట్టి.. దేశ చరిత్రలోనే సంక్షేమ పాలనకు సరికొత్త అర్థం చెప్పారు. అభివృద్ధికే కాదు, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో కేరాఫ్‌గా నిలిచి, యావత్తు దేశం దృష్టిని ఆకర్శించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని సకలజనులు స్పష్టం చేస్తున్నారు.
ఒక వ్యక్తి పాలన ఎలా ఉంటుందని చెప్పడానికి ఎనిమిదేళ్ల స్వరాష్ట్ర పాలనే నిదర్శనమన్న అభిప్రాయయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దేశంలో నెలకొన్న పరిస్థితులు, జీజేపీ అనురిస్తున్న తీరు, మతాలు, కులాలు పేరిట చెలరేగుతున్న విద్వేషం, జరుగుతున్న విధ్వంసం, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం, రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల జీవితాలతో ఆడుకోవడం, పంట ఉత్పత్తులను కొనేందుకు ప్రణాళిక లేకపోవడం, ప్రపంచ మార్కెట్లో దేశాన్ని పతానావస్థకు చేర్చడం, జీడీపీ పడిపోవడం, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో నిలువెల్లా నిర్లక్ష్యం, ఎగవేతదారులకు రూ.వేల కోట్లు మాఫీ చేయడం, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను అమాంతంగా పెంచడం, అడిగిన వారిపై ఎదురు దాడికి దిగడం, ప్రశ్నించిన రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేయడం.. ఇలాంటి ఆగడాలను ఆట కట్టించాలంటే..
రాజకీయ రంగంలోనే కాదు, అన్ని అంశాల్లోనూ పరిపూర్ణ పరిణతి చెందిన కేసీఆర్ లాంటి నాయకుడే దేశానికి అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ర్టాన్ని సాధించి అన్నింటా ఆదర్శంగా నిలిపిన నాయకుడు.. నేడు దేశ సమస్యలపై గళమెత్తాల్సిన అవసరం, అవశ్యకత ఆసన్నమైందంటున్నారు.‘దేశారాజకీయాల్లోకి పోదామా..’ అంటూ ఇటీవల పెద్దపల్లి, నిజామాబాద్ ప్రకటించడాన్ని స్వాగతించి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలన దేశానికి కచ్చితంగా కావాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ పాలన దేశానికి కచ్చితంగా కావాలి. ప్రధానిగా ఉన్న మోదీతో పేద, మధ్య తరగతి ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీలేదు. కార్పొరేట్ల కోసమే దేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నాడనిపిస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాడు. దీంతో పేదలు మరింత నిరుపేదలుగా మారుతుండగా, కార్పొరేట్లు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. మోదీ పాలన ప్రచారాలకే పరిమితమైంది.
దేశానికి ఏదో చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ వారి ఆశలు అడియాలైనట్లు తెలుసుకున్నరు. కాంగ్రెస్ పాలనతో దేశంలో అవినీతి పెరిగిపోయిందని గద్దెనెక్కిన ఆయన, వారికంటే రెండింతల అవినీతిని మూటగట్టుకుంది. గతంలో బీజేపీ అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడంతా రివర్స్‌గా మారింది. ఎందుకంటే పలు రాష్ర్టాల్లో బీజేపీ దౌర్జన్యంగా వ్యవహరించి పాలనపగ్గాలు చేపట్టింది. ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలను కూలదోసి పాలనపగ్గాలు చేపడుతున్నారు. అందుకనే ప్రజల్లో వారంటే వ్యతిరేకభావం పెరిగిపోయింది. దేశంలో పుష్కలంగా నీరు, సహజవనరులున్నా వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
డాలర్‌తో రూపాయి విలువ రోజు రోజుకూ దిగజారిపోతుండడంతో ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు కడుపునిండా తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భావి భారతానికి పునాదులు వేసే యువతను మోసం చేస్తున్నడు. ఉద్యోగాలు ఇవ్వడం కాదు ప్రైవేటీకరణతో ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా మారాయి. రైతులైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దెదించుదామా..? అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కరెంట్‌ను ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించి ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో అమలుకు సిద్ధమవడంతో ఆగ్రహంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కరెంట్ మరింత భారంకానుంది. ఇప్పుడు దేశమంతా కేసీఆర్‌వైపు చూస్తోంది. ఎందుకంటే బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించిండు.
ఇంకా కొత్త ఏర్పడిన రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్లూ దేశానికే మార్గదర్శకంగా నిలుపడం, వ్యవసాయరంగం కోసం తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలబెట్టడడం ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అలాగే ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. చాలా రాష్ర్టాల ప్రజలు మనలాంటి పథకాలు వారి వారి రాష్ర్టాల్లోనూ పెట్టాలని కోరుతున్నారు. తెలంగాణలోని కొన్ని పథకాలను దేశం కాపీ కొట్టి అమలు చేస్తుంది. మన రైతు బంధులాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తుండగా మిషన్ భగీరథ పథకాన్ని మరో పేరు పెట్టి దేశంలో అమలు చేస్తుంది. భారతదేశ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే కేంద్రం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ఆయన ఎప్పుటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ప్రధాని మోడీని ఎదుర్కొనే నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే. ఒక విజన్‌తో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కదులుతున్నడు. చాలా శుభపరిణామం.
– కాసారపు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ( కొత్తపల్లి)
కేసీఆర్ నాయకత్వం దేశానికి కరదీపిక
నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ ప్రవేశిస్తే కొత్త ఊపు వస్తుంది. ఆయన నాయకత్వం రాబోయే కాలానికి కరదీపికగా మారుతుంది. కుల, మత, వర్గ విభేదాలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న మత పిచ్చిగాళ్ల బారి నుంచి లౌకికవాదంతో ముందుకు వస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని రక్షించే అవకాశముంటుంది. హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం హర్షనీయం. మోదీ, అమిత్‌షాల నేతృత్వంలో భారతదేశం అభివృద్ధిలో 20 ఏండ్లపాటు వెనక్కిపోయింది.
ప్రపంచ చిత్రపటంలో భారత్ ఒక మతానికి సంబంధించిన దేశంగా పరిగణించే దుస్థితి దాపురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం కుదేలైంది. వ్యవసాయ వ్యవస్థను పారిశ్రామికవేత్త అదానికి అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం నుంచి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విధంగా, కేసీఆర్ ప్రధాని పదవి చేపడితే దేశం కూడా అలాగే అవరోహణ దిశలో ముందుకు సాగుతుంది. దేశంలో సుపరిపాలన అందించాలంటే, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే, మతతత్వ బీజేపీని పారదోలడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరముంది. ఇందుకోసం కేసీఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ వేదికగా కృషి చేయాల్సిన అవరసరం ఎంతైనా ఉంది.
– కొయ్యడ సృజన్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి(కరీంనగర్ కలెక్టరేట్)
అండగా నిలుస్తాం..
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం అందరూ సంతోషించదగ్గ విషయం. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలి. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నులు విధించడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదు. ఈ ఎనిమిదేండ్లలో పేదలను ముంచి పెద్దలకు పంచిపెట్టారు. పన్నుల రూపంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్లడం అత్యవసరం. ఆయనకు ప్రతి వ్యాపార వర్గం అండగా ఉంటుంది.
– గొలి శ్రీనివాస్, కిరాణ, వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు, జగిత్యాల(రాయికల్)
రైతులు గర్వపడేలా అభివృద్ధి చేస్తరు..
రైతు కుటుంబంలో పుట్టి, స్వయంగా ఒక రైతుగా పంటలు పండిస్తున్న కేసీఆర్ సీఎంగా ఉండడం మన రైతాంగం అదృష్టం. రైతుల సమస్యలు, కావాల్సిన అవసరాలు తెలిసిన వ్యక్తిగా కర్షకులు అడగకపోయినా అనేక పథకాలు తెచ్చి అమలు చేస్తున్నరు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా, పంటల సాగు కోసం ఎకరానికి రూ.5వేలు చొప్పున ఏడాదికి రెండు సార్లు పెట్టుబడి సాయం చేస్తున్నరు. రైతు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా రూ.5లక్షల బీమా ఇస్తండు. పండించిన పంటల ఉత్పత్తుల సేకరణ కోసం మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయీస్ సంస్థల ద్వారా ఐకేపీ, పీఏసీఎస్‌లతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు మేలు చేస్తున్రు.
వ్యవసాయం, రైతాంగం గురించి బాగా తెలిసిన రాజకీయ దురందరుడు కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అత్యవసరం. ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా రైతాంగానికి మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. రైతులు గర్వపడేలా ఈ దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడుపుతారనే విశ్వాసం ఉంది.
– అల్లూరి రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్, ఇబ్రహీంపట్నం(మెట్పల్లి)
దేశంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది
సీఎం కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ మాదిరి దేశంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ దగ్గరి నుంచి అన్ని రంగాలల్లో మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడి ప్రభుత్వం మహిళలను ఎంత మంచిగ చూసుకుంటుందో అందరికీ తెలుసు. బతుకమ్మ చీరలు, మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా, స్థానిక రాజకీయాలలో ప్రాధాన్యం. ఇలా చెప్పుకుంటూ పోతే బాలికలకు, యువతులకు, మహిళలకు ఆడబిడ్డకు కుటుంబంలో ఎంత మర్యాద ఉంటదో తెలంగాణ రాష్ట్రంల అంతే మర్యాద ఉన్నది.
బీజేపీ పరిపాలించే రాష్ర్టాలల్లో మహిళలపై ఎన్ని అరాచకాలు జరుగుతున్నయో రోజూ పత్రికలు, టీవీలల్లో చూస్తున్నం. రానున్న రోజులల్లో ఇంకెన్ని దారుణాలు సూడాల్సి అత్తదో అని భయపడుతున్నం. కేసీఆర్ సారు దేశ రాజకీయాలల్లోకి వస్తే ఎంతో మంచి జరుగుతది. ఒక్క మహిళలకే కాదు అన్ని వర్గాల వాళ్ల బతుకులు మారిపోతయి. ఇక్కడ ఉన్న పథకాలు దేశంల గూడ ప్రవేశపెడితే అందరు బాగుపడుతరు. బీజేపీ ప్రభుత్వం ఉన్నోళ్లనే బతికిస్తది. లేనోళ్ల రక్తం తాగుతంది. ఇట్లాంటోళ్లకు బుద్ది జెప్పాలంటే సీఎం కేసీఆర్ సారు దేశ రాజకీయాలల్లోకి రావడమే మంచిది. అందరికీ సంతోషం.
– నీల భార్య, మహిళా సంఘం సభ్యురాలు (వీణవంక)
కేసీఆర్‌తోనే పేదలకు సరైన న్యాయం
ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన త్యాగమూర్తి కేసీఆర్. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి దేశానికే దిక్సూచీలా తెలంగాణను నిలిపారు. పేదలకు సరైన న్యాయం జరగాలంటే అది ఆయన వల్లే సాధ్యం. అలాంటి వ్యక్తి నేడు దేశానికి అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశాన్ని ఆయన నిర్మిస్తారన్న నమ్మకం ఉంది.
– చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ)
దేశంలో పేదల కన్నీళ్లు తుడుస్తడు
కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మాలాంటి రైతులకు మంచిరోజులు వచ్చినయ్. ఆయన దేశమంతా పాలిస్తే అందరికీ మంచి జరుగుతది. ఇక్కడ ఫ్రీ కరెంటు ఇస్తండు.. పంటలకు నీళ్లివ్వడానికి మస్తు పనులు చేసిండు. రైతుల బాధలు తెలిసి ఇవన్నీ చేసిండు. ఇప్పుడు మన రైతులు మస్తు పంటలు పండిస్తున్నరు. గతంలెక్క ఇప్పుడు రైతులెవలూ సచ్చిపోతలేరు. రైతుబంధుతోటి పంటలకు పెట్టుబడి ఇస్తండు. ఏదైనా కారణంగా చనిపోతే వాళ్లింటికి బీమా కింద రూ.5 లక్షలు ఇస్తండు. కేసీఆర్ సార్ దేశ రాజకీయాలకు వెళ్తే తెలంగాణ లెక్కనే దేశంలోని రైతులంతా మంచిగయ్యే ఆలోచన చేస్తరు. నేను మా ఊళ్లో ఇంత అభివృద్ధి ఇప్పటిదాకా చూడలే. కేసీఆర్ సార్ దేశానికి ఉపయోగపడే వ్యక్తి. పేదల కన్నీళ్లు తప్పక తుడుస్తడు.
– ఈరవేని లక్ష్మణ్, రైతు, పోత్గల్(ముస్తాబాద్)
అన్ని వర్గాలకు న్యాయం జరుగుతది
సీఎం కేసీఆర్ ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు దేశమంతా ఉంటే అందరికీ మంచి జరుగుతది. పేద కుటుంబాలకు పెద్దన్నగా ఉంటూ ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆర్థికంగా ఆదుకుంటున్నడు. ప్రభుత్వ దవాఖానలను సకల సౌలతులతో నడిపిస్తున్నరు. చిన్న జిల్లాలు కాకముందు పెద్ద దవాఖానకు పోవాలంటే కనీసం 50 నుంచి 100 కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అందుబాటులో ఉన్నయ్. రైతులకు రైతుబంధు, బీమా, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులకు ఆసరాపింఛన్లు, దళితులకు దళితబంధు వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలను సీఎం కేసీఆర్ తెచ్చిండు.
ఇవన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తేనే అందరికీ మేలు జరుగుతది. యువత విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా మన దేశంలోనే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం. ఆయన నాయకత్వం దేశానికి అవసరం. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తేనే పేద వర్గాలతో పాటు ఇతర వర్గాలకు న్యాయం చేసినట్లవుతుంది.
– దావళ్ల లావణ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, రంగంపల్లి, (పెద్దపల్లి రూరల్)
రైతు పథకాలు దేశానికే ఆదర్శం..
రాష్ట్రంలో రైతులందరికీ అందుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. ఇప్పటి వరకు వచ్చిన సర్కారు ఏదీ కూడా రైతును పట్టించుకోలేదు. తెలంగాణల రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చింది. ఇలాంటివి దేశ రైతులందరికీ అందించాలంటే కేసీఆర్ అవసరం చాలా ఉన్నది. రానున్న రోజుల్లో దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలి.
– ఎలుక రాములు, రైతు, (ఇల్లంతకుంట)