కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 5: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్‌లో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది సమాజానికి ప్రయోజకులుగా చేసేది ఉపాధ్యాయులని, ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనదన్నారు. వేడుకలను పురసరించుకొని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డిని విద్యాసంస్థల ఉపాధ్యాయులు సత్కరించారు. పాఠశాలకు సుమారు 120 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నగరంలోని పారమిత, ఎక్స్ ప్లోరిక, ఐరిస్ విద్యా సంస్థల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదని చెప్పారు.
కార్యక్రమంలో పారమిత పాఠశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, భగవతి, ఆర్విన్ట్రీ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ బీ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి దంపతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు సత్కరించారు. అంతకు ముందు వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హనుమాన్‌నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చక్కగా పాఠాలు బోధించిన చిన్నారులను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్ రెడ్డి దంపతులను ఉపాధ్యాయులు సత్కరించారు. వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు గురువులు నేర్పిన విద్యతో విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను అధ్యాపకులు సన్మానించారు.
కార్యక్రమంలో ఏసీవోబీ సంపత్ కుమార్, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ ఎండీ అలీఖాన్, ఏవో బీ శ్రావణ్ కుమార్, రామేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెహర్‌నగర్‌లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీప్రకాశ్ రావు, వైస్ చైర్మన్ పృథీరావు, ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 5: నగరంలోని మానేరు పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.