కార్పొరేషన్, సెప్టెంబర్ 3 : ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, సేవల్ని మరింత చేరువ చేస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్‌కు దీటుగా హాస్పిటళ్లను తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నది. తాజాగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఒక్కో జిల్లా కేంద్రానికి రెండు బస్తీ దవాఖానలు మంజూరు చేయగా, ఇటీవలే జగిత్యాల, కరీంనగర్లో అందుబాటులోకి వచ్చాయి. రూపాయి ఖర్చు లేకుండా స్థానికంగానే మెరుగైన సేవలు అందుతున్నాయి. త్వరలోనే సిరిసిల్లలో ప్రారంభం కానుండగా, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో సర్కారు ముందుకుపోతున్నది. ఇప్పటికే జిల్లాలోని దవాఖానాల్లో కార్పొరేట్‌కు దీటుగా సేవలందుతున్నాయి. బయట రూ.5 వేలకు లభించే సీటీ స్కాన్, వివిధ వ్యాధుల రక్త, మూత్ర పరీక్షలన్నీ ఉచితంగా అందిస్తున్నారు. అయితే, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని దవాఖానల ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రధాన దవాఖానలు, యూపీహెచ్‌సీలు ఉన్నప్పటికీ పట్టణ శివారు గ్రామాల విలీనంతో నగరాలు, పట్టణాల పరిధి పెరిగింది. ఈ క్రమంలో ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు స్థానికంగానే అక్కడికక్కడే వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5వేల నుంచి 10వేల జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది.
నిర్మించింది ఇక్కడే..
ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రానికి రెండు బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు ఒక్కో దానికి రూ.13లక్షల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు స్థల పరిశీలన చేసి దవాఖానలు నిర్మించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజీవ్‌నగర్‌లో బస్తీ దవాఖాన నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. అలాగే వేములవాడ పట్టణంలో మరొకటి నిర్మించాలని నిర్ణయించారు. జగిత్యాల పట్టణంలో టీఆర్‌నగర్, ఇస్లాంపురలో రెండు దవాఖానలు నిర్మించి, అందుబాటులోకి తెచ్చారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి దవాఖాన అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. మరొకటి తీగలగుట్టపల్లిలో నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. కాగా, దవాఖానల్లో సకల వసతులు కల్పించారు. వైద్య సిబ్బందిని నియమించారు. ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, కాంటిజెంటల్ వర్కర్, ఫార్మాసిస్టులుండేలా చర్యలు తీసుకున్నారు.
సత్వర వైద్యం.. పెరిగిన తాకిడి..
ఇన్ని రోజులు బస్తీలు, కాలనీల్లోని ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు.. ఇలా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా స్థానికంగా ఉండే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషినర్ దగ్గరికి వెళ్లేవారు. కాగా, బస్తీ దవాఖానలు ప్రారంభం కావడం, సత్వర వైద్యం అందుతుండడం, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తుండడంతో స్థానికులు క్యూ కడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో నిత్యం 60 నుంచి 80 మంది వివిధ ఆరోగ్య సమస్యలపై దవాఖానకు వచ్చి సేవలు పొందుతున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి దవాఖానకు 40 నుంచి 50 మంది వస్తున్నారు. తమ కాలనీల్లోనే బస్తీ దవాఖానను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తుండడంతో ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకునే బాధ తగ్గిందని కాలనీ వాసులు అభిప్రాయపడుతున్నారు. సేవలను చేరువ చేసిన సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఓపిగ్గా వైద్యం అందిస్తున్నాం..
సీజనల్ వ్యాధులు ప్రబలే కాలంలో బస్తీ దవాఖానలు ప్రారంభించడం కాలనీ వాసులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. దవాఖానకు వచ్చే వారిని ఓపిగ్గా పరీక్షిస్తున్నాం. మందులు ఇస్తున్నం. ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎమర్జెన్సీ అయితే సమీపంలోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు గాని, జిల్లా ప్రధానాసుపత్రికి పంపిస్తున్నాం. బస్తీ దవాఖానల వల్ల ఆర్ఎంపీలు, పీఎంపీల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేకుండా పోయింది.
– సీహెచ్ వేణుగోపాల్, ఇస్లాంపుర బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ (జగిత్యాల)
ఎంతో ఉపయోగం
నగరంలో విలీనమైన తమ ప్రాంతంలో ప్రభుత్వం బస్తీ దవాఖాన నిర్మించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలకు ప్రభుత్వ వైద్యం కావాలంటే విద్యానగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌కు లేదంటే ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వెళ్లాల్సి వచ్చేది. కానీ మా కాలనీలో దవాఖాన ఏర్పాటు చేయడంతో ప్రజలకు దూరభారం తగ్గింది. రేకుర్తివాసులే కాదు చుట్టు పక్కల డివిజన్ల నుంచి వస్తున్నారు. దవాఖాన మంజూరు చేయించిన మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మేయర్ వై సునీల్‌రావుకు కృతజ్ఞతలు.
– ఎదుల్ల రాజశేఖర్, కార్పొరేటర్ (కరీంనగర్)