పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది. పెద్దబొంకూర్ శివారులో గల ఎస్సారెస్పీ క్యాంపులోని 22 ఎకరాల్లో 98 గదులు, 42 కార్యాలయాలతో కొలువుదీరింది. సకల హంగులతో రూపుదిద్దుకున్న పాలనాభవనం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబవగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆదివారం పరిశీలించారు. వచ్చే నెల 10న జగిత్యాల కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసింది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలను 32 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దబొంకూర్ శివారులోని ఎస్సారెస్పీ క్యాంపులోని 22 ఎకరాల సువిశాల స్థలంలో పాలనాభవనాన్ని నిర్మించింది.
ఆరు బ్లాకుల్లో సర్వాంగ సుందరంగా..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దబొంకూర్ ఎస్సారెస్పీ క్యాంపు ఆవరణలో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం 22ఎ కరాల్లో 48.07 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. 32 ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా జీ ప్లస్-2 పద్ధతిలో 6బ్లాకులుగా విభజించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 40, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించారు. మొత్తంగా ఈ భవన సముదాయంలో 42 శాఖలకు కార్యాలయాలను కేటాయించారు. జిల్లా మంత్రికి, కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లతో పాటుగా ఇతర జిల్లా స్థాయి అధికారుల చాంబర్లను నిర్మించారు. విశాలమైన మీటింగ్ హాల్, పారింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అందమైన గ్రీనరీని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కార్యాలయానికి భారీ కమాన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కార్యాలయం లోపల ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపుల మొక్కలు నాటారు.
ప్రారంభానికి ఏర్పాట్లు
సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ఈ నెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కలెక్టర్ డా.సర్వే సంగీత సత్యనారాయ ణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అధికారుల నివాసాల కోసం ప్రభుత్వం రూ.6.58 కోట్లు మంజూ రు చేయగా, ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్ క్యాంపు ఆఫీసులు పూర్తయి గృహప్రవేశాలు కాగా మరో ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారుల నివాస గృహాలు తాజాగా సిద్ధమయ్యాయి.
సీఎం సభ కోసం రాఘవాపూర్‌లో స్థల పరిశీలన
ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులోని టీఆర్ఎస్ భవన్ ఎదురుగా గల స్థలాన్ని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ఆదివారం పరిశీలించారు. పెద్దబొంకూరు ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం వెనుకవైపు ఉన్న స్థలాన్ని సైతం పరిశీలించిన వారు టీఆర్ఎస్ భవన్ ఎదురుగా ఉన్న స్థలాన్నే ఎంపిక చేసినట్లు తెలిపారు. వారి వెంట పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ టీ. భానుప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌దీపక్, రామగుండం పోలీసు కమిషనరేట్ ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, డీసీపీలు రూపేశ్ అఖిల్ మహాజన్, ఏసీపీ సారంగపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారు.
సెప్టెంబర్ 10న జగిత్యాలకు ముఖ్యమంత్రి
జగిత్యాల రూరల్, ఆగస్టు 21 : జగిత్యాలలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంప్రారంభోత్సవంలో భాగంగా వచ్చే నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తునట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనునట్లు చెప్పారు. అధికారులు కలెక్టరేట్ పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు.