Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవడం అంత సులువు కాదంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. బన్నీని కలవాలంటే మొత్తం 42 కండిషన్స్ ఉంటాయని, ఆయన ముందు ఎలా ప్రవర్తించాలి? ఏమి చేయకూడదు? వంటి నియమాలు ఉన్నాయని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన బాలీవుడ్ మహిళ కావేరి బరువా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. అల్లు అర్జున్ వ్యక్తిత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన టీమ్ వివరణ ఇవ్వక తప్పలేదు.
కావేరి బరువా చేసిన ఆరోపణలను బన్నీ టీమ్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ అగ్ర కథానాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, ఆమె వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అంశాన్ని తేలికగా తీసుకోబోమని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కావేరి బరువా వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 15న సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో బహిరంగ క్షమాపణ పోస్ట్ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి తప్పేనని అంగీకరించింది. అల్లు అర్జున్‌పై అనవసర ఆరోపణలు చేసినందుకు చింతిస్తున్నానని పేర్కొంది. ఆమెను ఫాలో అయ్యే వారు తక్కువగా ఉండటంతో ఆ పోస్ట్ మొదట పెద్దగా వెలుగులోకి రాకపోయినా, తర్వాత వైరల్ అయింది.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, ‘పుష్ప 2 ది రైజ్ ’ విజయానంతరం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో ఓ భారీ చిత్రానికి సిద్ధమవుతుండగా, తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. మరికొంత మంది ప్రముఖ దర్శకులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.