Sleep | మన శరీరానికి నిద్ర చాలా అవసరం. ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో మన శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల మన శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. నిద్రించడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు, అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. తగినంత నిద్రించడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ఆకలి, కడుపు నిండిన భావన కలిగించే హార్మోన్ ను నిద్ర ప్రభావితం చేస్తుంది. కనుక తగినంత నిద్రించడం వల్ల మనం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించవచ్చు. అలాగే నిద్ర భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నిద్ర పాత్ర ఎంతో ఉంది.
రోజూ తగినంత నిద్రించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తగినంత నిద్రించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నిద్ర మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నిద్రించడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఈ విధంగా నిద్ర వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే మన వయసును బట్టి మనం నిద్రించే సమయం మారుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి ప్రకారం నిద్రించే సమయం వయసును బట్టి గణనీయంగా మారుతూ ఉంటుంది. మన వయసును బట్టి మనం ఎన్ని గంటలు నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నవజాత శిశువులు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటలు నిద్రించాలి. అలాగే శిశువులు (4-12 నెలలు) 12-16 గంటలు, పసిబిడ్డలు (1-2 సంవత్సరాలు) 11-14 గంటలు, ప్రీస్కూలర్లు (3-5 సంవత్సరాలు) 10-13 గంటలు, స్కూలు వయస్సు పిల్లలు (6-12 సంవత్సరాలు) 9-12 గంటలు, టీనేజర్లు (13-17 సంవత్సరాలు) 8-10 గంటలు, పెద్దలు (18-60 సంవత్సరాలు) 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు, వృద్ధులు (61-64 సంవత్సరాలు) 7-9 గంటలు, 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు 7-8 గంటలు నిద్రించాలి. ఇలా మన వయసును బట్టి మనం నిద్రించే సమయం మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక శరీర అవసరాలను బట్టి కూడా మనం విశ్రాంతి తీసుకునే సమయం మారుతూ ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారి శరీరం కోలుకోవడానికి ఎక్కువగా నిద్రించాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా నిద్ర నాణ్యత తగ్గుతుంది. కనుక గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వృద్దాప్యంలో ఉన్న వారు రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కొంటారు. కనుక వారికి కూడా నిద్ర ఎక్కువగా అవసరమవుతుంది.ఈవిధంగా మన వయసు, మన శరీర అవరాలు మనం నిద్రించే సమయాన్ని ప్రభౄవితం చేస్తాయని, మన వయసుకు తగినంత సమయం పాటు మనం నిద్రించినప్పుడే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతామని వైద్యులు సూచిస్తున్నారు.