సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మహానగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో వినాయక నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా వందలాది వినాయక ప్రతిమలు తీసుకొచ్చి జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా జంట జలాశయాల్లో నిమజ్జనం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంట జలాశయాలు హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తున్నాయి. తాగునీరు అందించే ఈ రెండు రిజర్వాయర్లలో వినాయక నిమజ్జనాలు పూర్తిగా నిషిద్ధం. జలాశయాల్లో నిమజ్జనాలు చేయకుండా జలమండలి అధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
రెండు రిజర్వాయర్ల చుట్టుపక్కల నిరంతరం నిఘా ఉంచి.. భక్తులను రాకుండా నిలువరించాల్సి ఉంటుంది. కానీ ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు నిత్యం వందలాదిగా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. గణేశ్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేయడంతో జలాశయాలు కలుషితమవుతున్నాయి. ఆ నీళ్లు నగరంలోని దాదాపు సగం మంది ప్రజలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కలుషితమైన ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే జంట జలాశయాలు కాలుష్య కోరల్లో కూరుకుపోతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి మురుగు నీరు వచ్చి చేరుతున్నది. ఏకంగా సెప్టిక్ ట్యాంకర్లు మురుగు నీటిని నేరుగా జలాశయాల్లోకి వదిలిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో బహిరంగంగా వినాయక నిమజ్జనాలు జరుగుతుండటం కలవరపెడుతున్నది. ఈ ఘటనలు జలమండలి విజిలెన్స్, రిజర్వాయర్ల పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి.
ఆదివారం సెలవు దినం కావడంతో గ్రేటర్‌లోని పలు కాలనీలు, బస్లీలో వినాయకులను నిమజ్జనాలకు తరలించారు. 3వ రోజు నుంచే నిమజ్జనం ప్రారంభమయ్యాయి. సరూర్‌నగర్, కాప్రా, ఐడీఎల్ చెరువులతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబి పౌండ్ల వద్ద నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. నిమజ్జనాలు నిర్వహంచే చెరువుల వద్ద సరైన ఏర్పాట్లు లేవంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9, 11వ రోజు భారీ ఎత్తున్న నిమజ్జన కార్యక్రమాలు జరగనుండడంతో అప్పటి వరకైనా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలంటూ భక్తులు కోరుతున్నారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదంలో పడుతున్నాయి. కాలుష్య కారకాలు విచ్చలవిడిగా వచ్చి చేరుతున్నాయి. నిత్యం నిఘా, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉండటంతో అక్రమార్కులు తాగునీటిని కలుషితం చేస్తున్నారు. ఇప్పటికే గృహ వ్యర్థాలు, సెప్టిక్ వ్యర్థాలు, మురుగు చేరుతున్నా పర్యవేక్షణలోపంతో తాగునీరు కలుషితం అవుతున్నది. జలాశయాలను పర్యవేక్షించడానికి కేవ లం ఇద్దరు సిబ్బంది, ఒక హోం గార్డు చొప్పున నియమించారు. దీంతో వారు కేవలం 8 గంటలు మాత్రమే విధుల్లో ఉండటంతో అక్రమార్కులు విచ్చలవిడిగా కాలుష్య కారకాలను కలుపుతున్నారు. నగరానికి తాగునీరందించే జలాశయాలను 24 గంటలు పర్యవేక్షించాల్సిన జలమండలి రెండింటికి కలిపి కేవలం ఆరుగురిని నియమించడం ఆందోళన కలిగిస్తున్నది. అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే జలాశయాలు మరింత కలుషితమయ్యే ప్రమాదముంది. కాలుష్య కారకాలు చేరడంతో తాగునీరు విషతుల్యం అవుతుంది. ఇప్పటికైనా జలమండలి అధికారులు పర్యవేక్షణ సిబ్బందిని పెంచి తాగునీరు కాలుషితం కాకుండా నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు. నిమజ్జనాలు పూర్తయ్యేదాకా అదనపు సిబ్బందితో పర్యవేక్షించాలని వేడుకుంటున్నారు.