Hey Balwanth | ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి వరుస విజయాలను అందుకున్న సక్సెస్ఫుల్ ద్వయం బన్నీ వాస్, వంశీ నందిపాటి తాజాగా నిర్మించిన చిత్రం ‘హే బల్వంత్’. గతంలో ‘హే భగవాన్’గా ప్రకటించిన ఈ చిత్ర టైటిల్‌ను తాజాగా మార్చారు. నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై గోపీ అచ్చర దర్శకత్వంలో రూపొందిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుహాస్ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకున్నారు.
టైటిల్ మార్పు వెనుక కారణం
టైటిల్ మార్పు గురించి సుహాస్ స్పందిస్తూ.. ‘భగవాన్’ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు సినిమా కాన్సెప్ట్‌ను, టైటిల్‌ను పరిగణనలోకి తీసుకుని ‘హే బల్వంత్’గా మార్చాం. ఇందులో భాగంగా సీనియర్ నటుడు నరేష్ గారి క్యారెక్టర్ పేరును కూడా మార్చడం జరిగింది” అని తెలిపారు.
సినిమాలో తన పాత్ర గురించి సుహాస్ వివరిస్తూ.. ఇందులో నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని తపించే కుర్రాడిగా కనిపిస్తాను. తన తండ్రి చేసే బిజినెస్‌ను తను టేకాఫ్ చేయాలనుకున్నప్పుడు ఎదురైన పరిణామాలు ఏమిటి? ఆ బిజినెస్ నేపథ్యం ఏంటి? అనే అంశాలను దర్శకుడు చాలా వినోదాత్మకంగా మలిచారు. నా కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలింస్‌లో చేసిన తరహా కామెడీ ఈ సినిమాలో మళ్ళీ కనిపిస్తుంది అని సుహాస్ చెప్పారు.
వేగంగా పూర్తయిన షూటింగ్
నా కెరీర్లో ఓకే అయిన వెంటనే షూటింగ్ పూర్తి చేసుకుని, అతి త్వరితగతిన విడుదలకు సిద్ధమైన సినిమా ఇది. తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేసినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మళ్ళీ నా కెరీర్లో ఇంత ఫాస్ట్‌గా ఒక సినిమా జరుగుతుందా? అనిపించేంత వేగంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యింది అని పేర్కొన్నారు.
సక్సెస్ పై నమ్మకం
గత సినిమాల ఫలితాలపై స్పందిస్తూ.. విజయం కోసం ఎదురుచూడటం కొంత బాధగా అనిపించినా, వెంటనే తదుపరి సినిమాకు సిద్ధమవుతాను. వరుస సినిమాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని, మంచి కథ కోసం వేచి చూసి ఈ సినిమా చేశాను. వంశీ నందిపాటి గారు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. మా ఆవిడ కూడా సినిమా చూసి, ‘నువ్వు చేయాల్సింది ఇలాంటి సినిమాలే’ అని మెచ్చుకుంది. ఈ సినిమా నాకు తప్పకుండా విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశారు.
తమిళ అరంగేట్రం
తమిళ చిత్రం ‘మందాడి’లో తాను మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు సుహాస్ వెల్లడించారు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ చూసి ఆ చిత్ర బృందం తనను సంప్రదించారని, ఆ సినిమాలో తన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపారు. ఇక భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు బ్యానర్లో ఆయన అందించిన కథతో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి, త్వరలోనే అవి ఫైనల్ అవుతాయి అని ముగించారు.
ముఖ్య తారగణం
నటీనటులు: సుహాస్, శివానీ నగరం, నరేష్, యాంకర్ స్రవంతి తదితరులు.
దర్శకత్వం: గోపీ అచ్చర
నిర్మాత: బి. నరేంద్ర రెడ్డి (త్రిశుల్ విజనరీ స్టూడియోస్)
విడుదల తేదీ: ఫిబ్రవరి 20