వజ్రోత్సవ వేడుక ముగిసింది. భారత స్వాతంత్య్ర 75ఏండ్ల పండుగ ప్రతిఒక్కరిలోనూ స్ఫూర్తినింపింది. అధికార యంత్రాంగం రెండు వారాలపాటు షెడ్యూల్ ప్రకారం వేడుకలు నిర్వహించగా, దేశభక్తి ఉప్పొంగింది. స్వాతంత్య్ర సమరయోధులు, వారి పోరాట ఫలితాలు నేటి తరానికి అర్ధమయ్యేలా ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ, ఫ్రీడమ్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, రక్తదాన శిబిరాలు, వనమహోత్సవం వంటి వేడుకలతో ఉత్సాహం వెల్లివిరిసింది. మంత్రి గంగులతోపాటు జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీఆర్ పలు కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని చైతన్యం తేగా, కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 8 నుంచి ఆదివారం దాకా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలు తమ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. జిల్లాలో ఘనంగా వజ్రోత్సవాలు జరిగినట్లు వెల్లడించారు.
ఈ నెల 8న ప్రారంభ సమారోహం కార్యక్రమాలు నిర్వహించగా 9న జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న 3,08754 గృహాలకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మంత్రి స్వయంగా కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఇంటింటికీ తిరిగి పతాకాలను పంపిణీ చేశారు. అలాగే ఈ రోజు నుంచి జిల్లాలోని 13 థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. ఆదివారం దాకా ప్రదర్శించిన ఈ సినిమాను కరీంనగర్‌లోని మల్టీ ప్లెక్సీలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు తిలకించారు. జిల్లాలో మొత్తం 59,499 మంది పిల్లలు ఈ చిత్రాన్ని వీక్షించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
10న కరీంనగర్ నగరంలోని 7వ డివిజన్లో కొత్తపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులను మంత్రి గంగుల ప్రారంభించారు. జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 75 వేల మొక్కలు నాటారు.
11న జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ చౌక్‌లోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ దాకా నిర్వహించిన ఫ్రీడం రన్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గంగుల, జడ్పీ అధ్యక్షురాలు విజయతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
12న రాఖీ పండుగ సందర్భంగా జాతీయ భావం ఉప్పొంగేలా ఈ పండుగను నిర్వహించారు. అనాథ ఆశ్రమాలు, జిల్లా జైలులో ఈ పండుగను నిర్వహించుకుని పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దేశభక్తిని పెంపొందించే చిత్రాలు, డాక్యుమెంటరీలను జిల్లాలోని వివిధ కేబుల్ చానళ్లలో ప్రసారం చేశారు.
13న అంబేద్కర్ స్టేడియం నుంచి టవర్ సర్కిల్ దాకా పోలీసు కమిషనర్, అదనపు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది. స్థానికులు, వివిధ విద్యా సంస్థల నుంచి తరలివచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
14న దేశ ఔన్నత్యాన్ని, వజ్రోత్సవాల్లో చాటాలనే లక్ష్యంతో కళా ప్రదర్శనలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జానపద, చిందు, యక్షగానం, ఒగ్గు, కో లాటం, సాంస్కృతిక కళాకారులతో తెలంగాణ అమర వీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ ఆడిటోరియం దాకా ర్యాలీ జరిగింది. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
15న మునుపెన్నడూ లేని విధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి గంగుల పోలీసు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకునే విధంగా సాగాయి.
16న నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన ఎంతో విశిష్టతను సంతరించుకుంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 11.30 గంటలకు తెలంగాణ చౌక్‌లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో మంత్రి గంగుల పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతీయ గీతాలాపనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ పొలాల్లో రైతులు, రైతు కూలీలు కూడా జాతీయ గీతాన్ని ఆలపించారు. వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఎల్ఎండీ గేట్లపై ఈ గీతాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
17న నిర్వహించిన క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు, యువకులతోపాటు ఉద్యోగులు, పోలీసులు కలెక్టర్, సీపీ టీంలుగా ఏర్పడి క్రీడల్లో పాల్గొన్నారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరాలకు కూడా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 338 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
18న క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు. నైపుణ్యాన్ని, జ్ఞాన పటిమను పటిష్టవంతం చేసేందుకు నిర్వహించిన ఈ క్రీడా పోటీ ల్లో ఉద్యోగులు, పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.
19న జిల్లా ప్రభుత్వ దవాఖానాలోని ఎంసీహెచ్, వృద్ధాశ్రమాల్లో మంత్రి గంగుల, కలెక్టర్ ఆర్వీకర్ణన్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఇతర ప్రజా ప్రతినిధులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు కూడా పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
20న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలు దేశభక్తిని చాటేలా ఆవిష్కరించారు. విజేతలను నిర్ణయించి బహుమతులు అందించారు.
ఆఖరి రోజైన ఆదివారం నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మొక్కలు నాటారు. కరీంనగర్లో మంత్రి గంగుల, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు మొక్కలు నాటారు.