విద్యానగర్, ఆగస్టు 19: తల్లీబిడ్డల సంరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ సునీల్‌రావుతో కలిసి రోగులు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
వార్డుల్లో తిరుగుతూ వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. రజనీ అనే మహిళకు ఒకే కాన్పులో కవలలు (అమ్మాయి, అబ్బాయి) జన్మించడంతో వారికి రెండు సీఎం కేసీఆర్ కిట్లతో పాటు 5 వేలను బహుమతిగా మంత్రి అందించారు. పలువురు బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో సర్కారు దవాఖానలకు రావాలంటేనే భయపడేవారని, ఇప్పుడా పరిస్థితులు లేవని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా నాణ్యమైన ప్రభుత్వ వైద్యం కేవలం తెలంగాణలోనే సాధ్యమవుతుందన్నారు. ఎంసీహెచ్‌లో వైద్య సేవలపై బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తుండడంతో కరీంనగర్ ఎంసీహెచ్‌కు రోజుకు 250 నుంచి 300 మంది గర్భిణులు వస్తున్నారని చెప్పారు. పేషెం ట్ల సంఖ్య పెరగడంతో మాతా శిశు సంరక్షణ కేంద్రం సరిపోవడం లేదని, దీనిని విస్తరించి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. డీఎంహెచ్‌వో జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, వైద్యులు మంజుల, నవీన, పద్మ, వర్షి, అలీం, నర్సింగ్ సూపరింటెండెంట్లు సులోచన, సరళ, ఆఫీస్ సూ పరింటెండెంట్ పుల్లెల సుధీర్, వైద్యులు, కార్పొరేటర్ బండారి వేణు పాల్గొన్నారు.