హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 17: పట్టణంలోని మధువని గార్డెన్లో ఈ నెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ (లా అండ్ ఆర్డర్) డీసీపీ ఎం శ్రీనివాస్ సూచించారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డితో కలిసి మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహణకు పోలీస్‌శాఖ ముందుకు వచ్చిందని తెలిపారు. ఇందులో ప్రముఖ 70 కంపెనీల ప్రతినిధులు పాల్గొని వారి సంస్థల్లో మూడు వేల ఉద్యోగ నియామకాలు చేపడుతారని చెప్పారు. ఎస్ఎస్సీ నుంచి ఎంటెక్ వరకు వారి వారి విద్యార్హతలను బట్టి అవకాశాలను కల్పిస్తారని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే వారు రెండు ఫొటోలు, సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని కోరారు. ఎలాంటి సందేహాలున్నా హుజూరాబాద్, జమ్మికుంట సీఐలను సంప్రదించవచ్చని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు డబ్బులు అడిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో డివిజన్లోని సీఐలు వీ శ్రీనివాస్, జనార్దన్, జే సురేశ్, తిరుపతి, రాంచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.