కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : పంటల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టాలని, ఇందులో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయగౌరి స్పష్టం చేశారు. పంటలను సర్వేనంబర్ల వారీగా నమోదు చేసుకుని యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. బుధవారం జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, చిగురుమామిడి మండ లం ముల్కనూర్, కరీంనగర్ మండలం దుర్శేడు గ్రామాల్లో పర్యటించిన ఆమె, పంటల నమోదును పరిశీలించారు.
పంటల నమోదు ఏ విధం గా జరుగుతున్నదో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల వారీగా నమోదు చేసుకునేలా రూపొందించిన యాప్‌తో ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. ప్రస్తుత వానకాలంలో 3,62,474 ఎకరాల విస్తీర్ణానికి గానూ ఇప్పటి వరకు 1,75,526 ఎకరాల్లోని పంటలను నమోదు చేసినట్లు డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ విజయగౌరికి వివరించారు. ఈ సందర్భంగా విజయగౌరి మాట్లాడుతూ ఈ నెల 31 వరకు పంటల నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పని చేస్తుందని, చివరి స్థానంలో ఉన్న క్లస్టర్లకు నియమించిన సూపర్వైజరీ ఆఫీసర్లను డీఏవో, డీడీఏ, ఎంవోలు పర్యవేక్షించాలన్నారు. బేస్ సర్వే నంబర్ విజిట్ చేయకుండా పంటలు నమోదు చేయకూడదన్నారు. పంటల నమోదులో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటామని, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలోనో, ఇంట్లోనో ఉండి పంటలు నమోదు చేసే వారిని ఆధారాలతో సహా గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రెండు వారాలు ఫీల్డ్‌పైనే ఉండి అధికారులందరూ పంటల నమోదుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆమె వెంట డీఏవో శ్రీధర్‌తోపాటు మండల వ్యవసాయాధికారులు సత్యం, సురేందర్, రంజిత్‌కుమార్, రైతుబంధు సమితి సభ్యుడు మంద తిరుపతి, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు ఉన్నారు.