ఇల్లందకుంట ఆగస్టు 17: పత్తి పంటలో గులాబీరంగు పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని బొంగపాడు గ్రామంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పత్తి పంటలో వచ్చే వివిధ తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ… పత్తి పంటలో మూడు సంవత్సరాలకోసారి మార్పడి పద్ధతిని పాటించాలన్నారు. తక్కవ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీరంగు పురుగు ఉధృతిని చాలావరకు తగ్గించుకోవచ్చని చెప్పారు.
బీటీ పత్తిని విత్తేటపుడు పత్తి చుట్టూ 5 వరుసల్లో నాన్‌బీటీ పత్తి విత్తనాలను విధిగా విత్తుకోవాలని తెలిపారు. పత్తి చేను చుట్టూ తుత్తర బెండ, ఉమ్మెంత లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. పత్తి పంట విత్తిన 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చాలన్నారు. మూడు రోజుల తర్వాత బుట్టల్లో 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులు పడడం గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గులాబీరంగు పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపీటీసీ సంజీవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.