రామడుగు, ఆగస్టు 17 : ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా..’ అని ఓ సినీ గేయ రచయిత చెప్పినట్టు కొమ్మను దేవతామూర్తిగా తీర్చిదిద్దడంలో వెంకటస్వామి నేర్పరి. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన మ్యాడారం వెంకటస్వామికి చిన్న నాటినుంచే దైవభక్తి ఎక్కువ. ఆలయాల నిర్మాణంలో తాను ఓ ముఖ్య భూమిక పోషించాలనే తపన పడ్డాడు. ఆ ఆశయంతోనే అనేక ఆలయాల ఎదుట తాను ధ్వజస్తంభంలా నిలిచాడు. హిందూ సంప్రదాయంలో భాగంగా గ్రామాల్లో దేవాలయాలు నిర్మించుకుంటారు. ప్రతి ఆలయంలో దేవుడి విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్టాపన కూడా అంతే ప్రాముఖ్యమైనది.
రామడుగు మండలం దత్తోజిపేట గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21 తేదీ వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడి దేవాలయం ఎదుట ప్రతిష్ఠించేందుకు సుమారు 20 రోజులుగా చెమటోడ్చి 30 ఫీట్ల ధ్వజస్తంభాన్ని చెక్కాడు. ప్రధానంగా కరీంనగర్లోని వరాహాస్వామి ఆలయంలో నాలుగు ధ్వజస్తంభాలు చెక్కాడు. వీటితో పాటు కోరుట్ల అయ్యప్పస్వామి, జ్ఞాన సరస్వతీ ఆలయాలు, కోరుట్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రామస్వామి గౌడ్ నిర్మించిన అష్టలక్ష్మి ఆలయంలోనూ తానే ధ్వజ స్తంభాలను చెక్కాడు. ఇవేకాకుండా జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఈయన చేసిన ధ్వజ స్తంభాలనే ప్రతిష్ఠించారు. వారసత్వంగా వస్తున్న కులవృత్తిలో వైవిధ్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో 2007లో మొదటి ధ్వజస్తంభం చెక్కాడు. ఈ ధ్వజస్తంభం తయారీలో నారేప కలపను వాడుతారు. ఒక్కటి పూర్తిగా తయారుకావాలంటే సుమారు 20 నుంచి నెలరోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా ఆలయ గోపురం ఎత్తును బట్టి ధ్వజస్తంభం పొడవును నిర్ణయిస్తారు. ఆలయ శిఖరం ఎత్తును అనుసరించి 20 నుంచి 60 ఫీట్ల ఎత్తు వరకు ధ్వజస్తంభాన్ని చెక్కుతారు. ఇద్దరు సహాయకులతో పనిచేస్తేనే అనుకున్న సమయానికి తయారు చేయగలుగుతారు. ఒక్క ధ్వజస్తంభం పొడవు, మందాన్ని బట్టి సహాయకులకు అందించే రోజువారీ కూలి రూ.వెయ్యి వరకు ఇస్తానని వెంకటస్వామి తెలిపారు.