జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రజల భద్రత కోసమే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జమ్మికుంట పట్టణ సీఐ రాంచందర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బంది 80మంది గురువారం తెల్లవారుజామున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల గుర్తింపు కార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. సరైన పత్రాల్లేని 71 ద్విచక్రవాహనాలు, ఒక త్రీవీలర్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలో ప్రజలతో అడిషనల్ డీసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. జమ్మికుంట ప్రముఖ వ్యాపార కేంద్రమని, రైల్వేస్టేషన్ ఉండడంతో కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. అలాంటి వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వకూడదని పేర్కొన్నారు. వాహనాలపై నంబర్ ప్లేట్ లేకపోయినా, నంబర్‌ను ట్యాంపరింగ్ చేసినా వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నిత్యం వాహనాలు తనిఖీ చేస్తామని, వారానికోసారి పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహిస్తామని చెప్పారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల సమయంలో ప్రజలు సహకరించాలని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి కోరారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో జమ్మికుంట రూరల్, హుజూరాబాద్ టౌన్, రూరల్ సీఐలు సురేశ్, శ్రీనివాస్, కిరణ్, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు దత్తాద్రి, సతీశ్, కిరణ్‌రెడ్డి, చీనానాయక్, షాఖాన్, శేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రావు, మధూకర్‌రెడ్డి, తిరుపతి, మౌనిక, ప్రొబెషనరీ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు, సిబ్బంది పాల్గొన్నారు.