కార్పొరేషన్, ఆగస్టు 1: రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా దర్శనం చేసుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక మొకులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి దంపతులను ఆశీర్వదించి స్వామి వారి పట్టు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ, కరీంనగర్లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. ఈ స్థలంలో టీటీడీ సహకారంతో దేవాలయ నిర్మాణం త్వరలోనే జరుగుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తమ ఆస్తిగా భావిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సీఎం అండగా నిలుస్తారని, వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మూడోసారి కూడా ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. ఇక్కడ మంత్రితో పాటుగా టీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌గౌడ్ ఉన్నారు.