కొడిమ్యాల, జూలై 21: కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. కొడిమ్యాల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 28 మందికి రూ. 28 లక్షల 3 వేల 248 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం ఆయన అందజేసి, మాట్లాడారు. ఆడబిడ్డల వివాహాలకు కానుకగా సాయం అందుతున్నదని, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని వివరించారు.
ములుగు జిల్లా భాగ్యతండాకు చెంది న కిమానాయక్కు ముగ్గురు సంతానమని, పెద్దబిడ్డ నిర్మల వివాహం నిశ్చయమై ముహూర్తం కుదిరిందని చెప్పారు. తెల్లవారితే వివాహం జరిపించాల్సి ఉండగా రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు కాలిపోయాయని, ఈ క్రమంలో కేసీఆర్ వారి ఇంటికెళ్లి వివాహానికి రూ.లక్ష అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు తీసుకున్న నిర్ణయమే కల్యాణ లక్ష్మి పథకమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమానికి కృషిచేస్తున్నదని, దళిత బంధు పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ సాయం అందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, తహసీల్దార్ స్వర్ణ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, బండ రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి, సర్పంచులు ఎగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అంకం రాజేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, నాయకులు చీకట్ల మహేందర్, బొడ్డు రమేశ్, మ్యాకల మల్లేశం, అంబటి తిరుమలేశ్, బండపల్లి అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ధమాకా..
కొండాపూర్ అనుబంధ గ్రామం బొల్లెన్చెరువుకు చెంది న చిర్రవేణి రాజేశ్వరి-తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుర్లు లావణ్య, అనామిక. ఆరు నెలల క్రితం వీరిద్దరి వివాహాలు జరిపించారు. ఈక్రమంలో ఒక్కొక్కరికి రూ.లక్షానూటపదహార్ల విలువైన రెండు చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకొని రాజేశ్వరి సంబురపడ్డది.