కార్పొరేషన్/కమాన్‌చౌరస్తా, జూలై 21: వాణీనికేతన్ విద్యా సంస్థల అధినేత అయోధ్య రామారావు ఆశయ సాధనకు పూర్వ విద్యార్థులంతా కృషి చేయాలని మేయర్ వై సునీల్‌రావు పిలుపునిచ్చారు. నగరంలోని వాణీనికేతన్ పాఠశాలలో గురువారం అయోధ్య రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ వై సునీల్‌రావు కళాశాల ఆవరణలో అయోధ్య రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాణీనికేతన్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదానం చేసిన విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కళాశాల ఆవరణలో అయోధ్య రామారావు కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి పూల మొకలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వాణీనికేతన్ విద్యా సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యనందించి మేధావులుగా తీర్చిదిద్దిన గొప్ప విద్యావేత్త అయోధ్య రామారావు అని కొనియాడారు. వాణీనికేతన్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులమంతా అయోధ్య రామారావు ఆశయాలను నెరవేర్చేలా కార్యక్రమాలు చేపట్టి, ఆయన చూపిన బాటలో నడుస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే విద్యారంగంలో మొదటి స్థానంలో నిలిపేలా పూర్వ విద్యార్థులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామారావు జయంతి సందర్భంగా 2022-23 సంవత్సరానికి ఉచిత విద్య పథకానికి లక్కీ డ్రా తీశారు. పాఠశాలలో చదివి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులను కళాశాల యాజమాన్యం మేయర్ చేతుల మీదుగా అందజేశారు. కాగా, విద్యాసంస్థలకు చెందిన 45 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణరావు, పెద్దపల్లి జితేందర్, విద్యాసంస్థల యాజమాన్యం, రామారావు కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.