ఫిబ్రవరి 15 నుంచి రైస్ మిల్లులల్లో ఎఫ్సీఐ సేకరించే సీఎంఆర్ నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం మిల్లింగ్ ఆగిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. అంతే కాకుండా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని చోట్ల బస్తాల్లోనే ధాన్యం మొలకెత్తింది. ఫలితంగా రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. కాగా, కరీంనగర్ జిల్లాలో ఒక్క శంకరపట్నం మండలంలో మొత్తం 18 రైస్, పారాబాయిల్డ్ మిల్లులు ఉండగా, దాదాపు 4 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కొన్ని మిల్లుల్లో స్థలం లేక సేకరించిన ధాన్యం బస్తాలను ఆరుబయటే నిల్వ చేశారు. అయితే, ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దాదాపు సగటున 20 శాతం తడిసి మొలకెత్తినట్లు మిల్లర్లు వెల్లడించారు. తడిసిన ధాన్యం బస్తాలలోనే మొలకెత్తడంతో పలువురు మిల్లర్లు దిగాలు పడుతున్నారు. ఒకవైపు ధాన్యం నిల్వ సమస్యను ఎలా అధిగమించాలో తెలియని సంకట స్థితిలో ఉండగా, తాజాగా ఎఫ్సీఐ ధాన్యం సేకరణ నిలుపుదల చేయడంతో గోరు పోటుపై రోకటి దెబ్బలా తమ పరిస్థితి తయారైందని మిల్లర్లు వాపోతున్నారు.
భారంగా మారిన నిర్వహణ వ్యయం
రైస్ మిల్లుల నిర్వహణ వ్యయం మిల్లర్లకు భారంగా మారింది. ఐదు నెలలుగా ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోవడంతో మిల్లర్లు మర ఆడించడం లేదు. దీంతో రైస్ మిల్లుల యజమానులకు నిర్వహణ వ్యయం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మర ఆడించి పంపినా నాణ్యతా నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ తీసుకునే అవకాశం అంతంత మాత్రమేనని వారు వాపోతున్నారు. పని లేకపోవడంతో మిల్లులు మూత పడడంతో బీహార్ హమాలీలు, ఒడిశా కూలీలు ఉపాధి కోల్పోయి క్రమంగా సొంత రాష్ర్టాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఈ తరుణంలో రైస్ మిల్లర్లు మరింతగా నష్టాల ఊబిలో కూరుకోకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మిల్లర్లను ఆదుకోవాలి
వానకాలం ఆరంభంలోనే వర్షాల తీవ్రత ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహిస్తే భయంగా ఉంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్ని మిల్లుల్లో కనీసం 20-40 శాతం వరకు ధాన్యం తడిసి మొలకెత్తింది. ఈ పరిస్థితులోళ మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకున్నారు. ఇక మరింత ధీనావస్థకు చేరితే కోలుకోలేరు. అలాగే, ధాన్యం కూడా రంగు మారి మరింతగా నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. మిల్లింగ్ వ్యవస్థ కుప్ప కూలక ముందే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లుల యాజమాన్యాలకు చేయూతనందించి ఆదుకోవాలి.
– గర్రెపల్లి శంకరలింగం, రైస్ మిల్లర్ల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు