ధర్మపురి, జూలై 13: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అనుక్షణం అధికారులను అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద కుర్రువాగు సమీపంలోని ఐలాండ్ వద్ద చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించామని తెలిపారు. న్యూస్ కవరేజీకి వెళ్లిన ఎన్టీవీ జర్నలిస్టు జమీర్ గల్లంతు కావడం బాధాకరమన్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. బుధవారం ఆయన జగిత్యాల కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మతో కలిసి ధర్మపురి వద్ద గోదావరి ప్రవాహన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భారీగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లాలోని ప్రాజెక్టులు, వాగులు, వంకలు పోటెత్తుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తిచేశారు. ప్రజలు సైతం సహకరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరో మూడురోజులు వానలు కురిసే అవకాశం ఉన్నదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాగా, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తున్నందునా రహదారులను మూసివేశామని ఎస్పీ చెప్పారు.