కార్పొరేషన్, జూలై 13 : వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే ఉన్నదని, ఎలాంటి ఆందోళన వద్దని సూచిం చారు. బుధవారం నగరంలోని కిసాన్‌నగర్, క్రిష్ణనగర్, అశోక్ నగర్, అలకపురి కాలనీ తదితర ప్రాంతాల్లో మేయర్ వై సునీల్‌రావుతో కలసి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోనే ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు మత్తళ్లు దూకుతున్నాయని, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. కొన్నిచోట్ల పాతబడ్డ ఇండ్లు కూలిపోవడంతో నిరాశ్రయులుగా మారిన వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని పేరొన్నారు. నిరాశ్రయులను ఆదుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో చాలా చోట్ల పంట నీట మునిగిందని, వరద ప్రవాహం తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. తుది నివేదిక అందిన వెంటనే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వీఆర్వో స్థాయి నుంచి ఎమ్మార్వో పోలీస్ సిబ్బంది అంతా గ్రామాల్లో ఉన్నారన్నారు. అక్కడి పరిస్థితులపై తమకు తెలియజేస్తున్నారని చెప్పారు. అవసరం మేరకు అప్పటికప్పుడే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నగరంలో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో అధికారులు వరద నీరు తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నార్నారు. మేయర్ నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.