కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో జన జీవనం స్తంభించి పోయింది. బుధవారం ఉదయం జిల్లా సగటు వర్ష పాతం 127.7 మిల్లీ మీటర్లు కురిసింది. అత్యధికంగా రామడుగు మండలంలో 235.5 మిల్లీ మీటర్లుగా నమోదైంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి వరద వచ్చి చేరుతోంది. నిన్నా, మొన్న స్వల్పంగా వచ్చిన వరద బుధవారం ఒక్కసారిగా పెరిగింది. నిన్న కేవలం 2 వేల క్యూసెక్కుల వరద మాత్రమే రాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 21,630 క్యూసెక్కుల వరద వచ్చింది. రాత్రి వరకు కాస్త తగ్గింది. ప్రస్తుతం 14,685 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మోయతుమ్మెద, మానేరు వాగుల నుంచి వరద వస్తోంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.458 టీఎంసీల నీరు ఉంది. బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, రిజర్వాయర్‌లోకి మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిండుతున్న చిన్న నీటి వనరులు..
భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతోంది. కొన్ని చెరువులు ఇప్పటికే మత్తడి దుంకుతున్నాయి. జిల్లాలో మొత్తం 1.376 చెరువులు, కుంటలు ఉండగా ఇప్పటికే 428 చెరువులు మత్తళ్లు పడుతున్నాయి. ఇరిగేషన్ డివిజన్ 5, 6లొ అత్యధికంగా చెరువులు కుంటలు సర్‌ప్లస్‌గా మారాయి. 5 డివిజన్ పరిధిలోని కరీంనగర్ రూరల్ మండలంలో 72 చెరువులు ఉండగా 38 చెరువులు మత్తడి పడుతున్నాయి. మరో 27 చెరువులు నిండుకుండల్లా మారాయి. కొత్తపల్లి మండలంలో 48 చెరువులకు 18 మత్తడి పడుతున్నాయి. మరో 21 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. శంకరపట్నం మండలంలో 112 చెరువులు, కుంటలు ఉండగా 58 మత్తడి పడుతున్నాయి. మానకొండూర్‌లో 192 చెరువులు ఉండగా 19 చెరువులు మత్తడి పడుతుండగా, మరో 118 పూర్తి స్థాయిలో నిండాయి. 6వ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ 86 చెరువులకు 7 మత్తడి పడుతున్నాయి. 65 పూర్తి స్థాయిలో నిండాయి. ఇల్లందకుంటలో 66 చెరువులకు 18 చెరువులు మత్తడి పారుతుండగా 46 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. ఈ రెండు డివిజన్లలోనే 278 చెరువులు మత్తడి పడుతున్నాయి. ఇక వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న చొప్పదండిలో 75 చెరువులు ఉండగా అన్ని మత్తళ్లు పడుతున్నాయి. రామడుగులో ఉన్న మరో 75లో 60కిపైగా మత్తల్లు పడుతున్నాయి. రామడుగు మండలం వెదిర నాగులకుంటకు గండి పడింది. నమిల చెరువు కూడా తెగిపోయే ప్రమాదంలో ఉంది. ఇక మిగిలిన ఇరిగేషన్ డివిజన్ల పరిధిలోని మండలాలు కపలుపుకుని మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 428 చెరువులు, కుంటలు మత్తళ్లు పారుతున్నాయి..
ఫీల్డ్ మీదనే జిల్లా యంత్రాంగం..
వర్షాల ప్రభావంతో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన ప్రభుత్వ యం త్రాంగం అందుబాటులో ఉంటోంది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫి ర్యాదులకు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వర్షాలు తీ వ్రమైన రెండు రోజులుగా కంట్రోల్ రూంకు సహాయార్ధం వస్తున్న ఫోన్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మంగళవారం 5, బుధవారం 17 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన కాల్స్‌ను సంబంధిత ప్రాంతంలోని అధికారులకు కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం వెళుతోంది. స్థానిక అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించి సహాయక చర్య లు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని, రోడ్లపై నిలిచాయని ఫిర్యాదులు వ స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కూలి న ఇండ్ల వివరాలను తెలుసుకుంటూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగి పడినా, విద్యుత్తు స్తంభాలు విరిగి పడినా అధికారులు తక్షణమే స్పందించి సహాయం చేస్తున్నారు. పోలీసు శాఖ కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటోంది.
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
వర్షాలు తీవ్ర ప్రభావం చూపిన మండలాల్లోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామడుగు మండల కేంద్రానికి వెళ్లే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కరీంనగర్, రామడు గు రహదారిపై రాకపోకలు నిలిచి పోయాయి. ఇదే మండలంలోని వెలిచాలకు వెళ్లే దారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తపల్లి పట్టణం నుంచి వెలిచాలకు వెళ్లే రోడ్డు డ్యాంపై విపరీతమైన వరద కారణంగా రాకపోకలు నిలిచి పోయాయి. శంకరపట్నం మండలంలోని అర్కం డ్ల కాజ్మే మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అర్కండ్ల, కన్నారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అయితమ్మ చెరువులోకి భారీ వరద వస్తున్న కారణంగా రాగంపేట, అర్నకొండ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయా యి. సైదాపూర్ మండలంలోని సోమారం, ఎక్లాస్పూర్ మధ్య కల్వర్టు పొంగి పొర్లుతున్న కారణం గా ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. సైదాపూర్‌కు ఈ రెండు గ్రామాల ప్రజలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
కరీంనగర్లో పర్యటించిన మంత్రి గంగుల
వర్షాల ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం సాయంత్రం మంత్రి గంగుల కరీంనగర్‌లోని పలు డివిజన్లలో పర్యటించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న కిసాన్ నగర్, కృష్ణనగర్ కాలనీ, అల్కాపురి కాలనీలో కలియదిరిగారు. తెలంగాణ చౌక్‌లో వరద రోడ్లపైకి వచ్చిన పరిస్థితిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితిని గమనిస్తున్నారని, ఎలాంటి సంఘటలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు.