మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలకు జన జీవనం అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పలు చోట్ల నిరాశ్రయులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి భరోసా కల్పిస్తున్నది.డివిజన్లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. అలాగే వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయి. హుజూరాబాద్‌లో 8.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలోని గుండ్ల చెరువుకు భారీగా వరద రావడంతో నిండుకుండను తలపిస్తున్నది. మండలంలోని రాజపల్లెలోని గార్లకుంట మత్తడి పోస్తున్నది. వర్షం పడడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. వరినాట్లు ముమ్మరం చేశారు.
హుజూరాబాద్ పట్టణంలో..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుజూరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలైన కిందివాడ, మామిండవాడ, గాంధీనగర్, బుడగజంగాలకాలనీ, గ్యాస్‌గోదాం ఏరియా, సిద్ధార్థనగర్, కొత్తపల్లి, ఇందిరానగర్‌లోని సిక్కులవాడ, బోర్నపల్లిలోని తెనుగువాడ, దమ్మక్కపేట ఎస్సీకాలనీ, ఇప్పల్‌నర్సింగాపూర్ ఎస్సీకాలనీలో పలు ఇండ్లల్లోకి వరద చేరింది. చిలుకవాగు నిండి మత్తడి దుంకుతున్నది. అలాగే స్థానిక బోర్నపల్లి వద్ద హుజూరాబాద్-సైదాపూర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో బల్దియా చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ చీమ వెంకన్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. దమ్మక్కపేట బర్రెంకలకుంట, చిలుకవాగు, బోర్నపల్లి ఊర చెరువులు మత్తడి దుంకడంతో మత్స్యకారులు వరదనీటిలో చేపలు పట్టారు. గుండ్ల చెరువు నిండి మత్తడి దుంకుతుండగా పలువురు ఆసక్తిగా తిలకించారు. వర్షాల కారణంగా బోర్నపల్లిలో ఓ ఇల్లు, దమ్మక్కపేట ఎస్సీ కాలనీలో ఓ ఇంటి గోడలు తడిసి కూలిపోయాయి. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్, హెల్త్ అసిస్టెంట్ కిషన్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక రిస్క్ టీం లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ఎక్స్కవేటర్ సహాయంతో వరద నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నది.
కాట్రపల్లిలో కూలిన ఇల్లు
కాట్రపల్లి గ్రామంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎదులాపురం కనకమ్మ అనే వృద్ధురాలి ఇల్లు కూలి పోయింది. స్థానిక సర్పంచ్ నిరోషాకిరణ్ ఆమెను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంటలో 11 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడింది. కుండపోత వానకు మున్సిపల్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు, హనుమాండ్లపల్లి, పిట్టలవాడ, తదితర కాలనీలోని ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నిత్యావసర సరుకులు తడిసి పోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లకే పరిమితమవుతున్నారు. స్థానిక ప్రజలకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కమిషనర్ సమ్మయ్య అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. నీరు నిలువకుండా ఉండేందుకు మట్టిని తోడి క్లియర్ చేసేందుకు ఎక్స్‌కవేటర్‌ను వాడుతున్నారు. నాయిని చెరువుకు భారీగా వరద వచ్చి చేరింది. చెరువు మత్తడి దుంకుతోంది.
చెరువు కట్ట పరిశీలన
పట్టణంలోని నాయిని చెరువు నిండగా చెరువు కట్టను బుధవారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ బండ రాజేశ్వరి, ఎంపీపీ దొడ్డె మమత, టౌన్ సీఐ రామచంద్రారావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పరిశీలించారు. అంతకుముందు మడిపల్లి చెరువు వరద తాకిడికి రోడ్డు దెబ్బతినగా పరిశీలించి, మరమ్మతు చేయించాలని గ్రామ స్థాయి అధికారులకు సూచించారు. ఇక్కడ ఎస్ఐలతో పాటు మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, కనగర్తి, సిరిసేడు, బూజునూర్, వంతడుపుల, రాచపల్లి, చిన్నకోమటిపల్లి, బోగంపాడు, మల్యాల గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పలు గ్రామాల్లో వర్షాలతో నెలకొన్న పరిస్థితులను తహసీల్దార్ మాధవి పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
సైదాపూర్‌లో..
మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు 89.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఎక్లాస్పూర్-సోమారం కల్వర్టు, సోమారం-మొలంగూర్ కల్వర్టు వద్ద వరద నీటి ప్రవాహం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సైదాపూర్ న్యాల చెరువు, ఎక్లాస్పూర్ దేవుని చెరువు, ఎక్లాస్పూర్, సైదాపూర్, సోమారంతో పాటు పలు గ్రామాల్లోని కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. ఎక్లాస్పూర్ గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని సర్పంచ్ కొత్త రాజిరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం మోటర్ సాయంతో తొలగించింది. వెన్నంపల్లి గ్రామంలో సర్పంచ్ అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, కార్యదర్శి పోరెడ్డి నరేందర్‌రెడ్డి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించారు. వాటిలో నివాసం ఉంటున్న ఏడు కుటుంబాలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారు. సోమారం గ్రామంలో అత్యవసర సేవలందించే పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, ఉప సర్పంచ్ అనగోని శ్రీనివాస్‌గౌడ్ రెయిన్ కోట్స్ అందించారు.
వర్షాలకు దెబ్బతిన్న ఏడు ఇండ్లు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వెన్నంపల్లిలో రెండు, గొల్లగూడెంలో రెండు, గొడిశాలలో ఒకటి, జాగీర్‌పల్లిలో ఒకటి, బొమ్మకల్‌లో ఒకటి చొప్పున మొత్తం ఏడు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహసీల్దార్ సదానందం తెలిపారు. వెన్నంపల్లిలో ఏడు, గొల్లగూడెంలో నాలుగు, గొడిశాలలో ఒకటి చొప్పున 12 శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించగా, వాటిలోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.
వీణవంకలో..
ఎడతెరిపి లేని వానలతో వీణవంక, కోర్కల్, ఎలుబాక గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు పాత ఇండ్లు కూలగా, రెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, పోతిరెడ్డిపల్లి, కనపర్తి గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారి కోర్కల్ శివారులో పైనుంచి వచ్చే వరద ప్రవాహానికి రోడ్డు తెగిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. మల్లారెడ్డిపల్లి కుంటివాని చెరువు మత్తడిపడడంతో పలువురు రైతుల వరి నారుమడులు కొట్టుకుపోయాయి. మండలంలో మొత్తం తొమ్మిది చెరువులు ఉండగా, ఎనిమిది మత్తడి దుంకుతున్నాయి. వీణవంక చెరువు పూర్తి స్థాయిలో నిండింది. 109 కుంటలకు గానూ 30 పూర్తిగా నిండగా, 79 కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వర్ష నష్టాన్ని తహసీల్దార్ డీ రాజయ్య, ఎస్ఐ శేఖర్‌రెడ్డి పరిశీలిస్తూ తగిన సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఏదైనా సహాయం కావాలంటే సమాచారం ఇవ్వాలని కోరారు.
జమ్మికుంట మండలంలో..
కుండపోత వర్షానికి చెరువు కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. విలాసాగర్ మానేరు చెక్‌డ్యాం వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నది. అంకుషాపూర్ ఊర చెరువు, బిజిగిరిషరీఫ్లోని యాగనికుంట చెరువు, నరసిల్లకుంట చెరువు, మంగళికుంట, గండ్రపల్లి, తనుగుల గ్రామాల్లోని అంకుషావళి చెరువు, కొత్తకుంట(హనుమంతునికుంట), చాకలికుంట, కుమ్మరికుంట, జగ్గయ్యపల్లి రామునికుంట, కోమలికుంట, కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లిలో పెద్దచెరువు, నాగులకుంట, ఎర్రకుంట, ఈదులకుంట, బెత్తోనికుంట, గోవింద్ చెరువుకుంట, మడిపల్లి ఊర చెరువు, మొండికుంట, మాచనపల్లి కేశిరెడ్డికుంట, ఊర చెరువు, నగరం కొత్త చెరువు, నాగంపేట గంగారం చెరువు, కొత్తకుంట, నాగారంలో నాగారంకుంట, పాపయ్యపల్లి బంజరికుంట, పాపక్కపల్లి నల్లకుంట, ఎర్రకుంట, పెద్దంపల్లి వోనాలదేవికుంట, సైదాబాద్ కందిరేణికుంట, కుమ్మరికుంట, రంగసాయికుంట, రావికుంట, శాయంపేట పులికుంట, కలికుంట, చలికుంట, వావిలాల పెద్ద చెరువు, ఏలేటివారి కుంట నిండి మత్తడి దుంకుతున్నాయి. వర్షాలకు మడిపల్లి, తనుగుల, సైదాబాద్‌లో పాత ఇండ్ల గోడలు పాక్షికంగా దెబ్బతినగా, బిజిగిరిషరీఫ్లో సురం రాజయ్య, బిజిగిరి కిరణ్ పెంకుటిల్లు, ఉప్పల శ్రీను, ఎర్ర సమ్మయ్య పూరి గుడిసెలు కూలిపోయాయి. బిజిగిరిషరీఫ్ గ్రామ శివారులోని మంగళికుంటకు గండిపడింది. విలాసాగర్ గ్రామంలోని రైల్వే అండర్‌బ్రిడ్జిలో వర్షం నీరు చేరగా రాకపోకలు నిలిచిపోయాయి.