తెలంగాణచౌక్, జూలై 13: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం కేంద్రంలోని మోదీ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. బీజేపీ దళిత, గిరిజన, ఆదివాసీల వ్యతిరేకపార్టీ అని దునుమాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతూ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..కరీంనగర్లో మౌనదీక్ష చేయడం కాదని, దమ్ముంటే పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలకు నిరసనగా మోదీ ఎదుట చేయాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన కరీంనగర్లోని ప్రతిమ హాటల్లో విలేకరులతో మాట్లాడారు. ఏటా కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మోదీ ఇప్పుడు మొండిచెయ్యి చూపుతున్నారని నిప్పులు చెరిగారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు ఇప్పటికే 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 91 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైందని చెప్పారు.
కేసీఆర్ ప్రధాని అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్భాటం కోసమే బీజేపీ హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిందని విమర్శించారు. ఇందులో దేశ ప్రజల సమస్యలపై చర్చించకుండా.. ప్రభుత్వాలను ఎలా కూల్చాలో కుట్రలు రూపొందించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీకి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం కలేనని దెప్పిపొడిచారు. బీజేపీ దళిత, గిరిజనులను రాష్ట్రపతిని చేస్తున్నామంటూ రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నదన్నారు. గత పాలకులు సైతం అవకాశం ఇచ్చారని, కానీ వారు ఇలా ప్రచారం చేసుకోలేదని గుర్తు చేశారు. సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, ఉపాధ్యక్షుడు కల్వల ఆనంద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుల్తానా, వసీమ్ అహ్మద్, శంకర్, అనిల్, రవీందర్ నాయక్, సంజీవ్నాయక్ పాల్గొన్నారు.