కార్పొరేషన్, నవంబర్ 30: సమ్మక్క, సారలమ్మ జాతర కోసం నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరంలోని రేకుర్తిలోని సమ్మక్క గద్దెల వద్ద ప్రతి రెండేళ్ల కోసారి జరిగే జాతరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రెండేళ్ల కిత్రం నగరపాలక సంస్థ అతి తక్కువ సమయంలో భారీగా ఏర్పాట్లు చేసింది. కాగా వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఈ జాతర కోసం రెండు నెలల ముందుగానే నగరపాలక సంస్థ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కాకతీయ కాలువ, చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలో దృష్టి సారిస్తున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి జాతర ప్రాంతం వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేసే విషయంలోనూ దృష్టి పెట్టారు. జాతర ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదుల ఏర్పాటు , పూర్తిస్థాయిలో లైటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారీ లైట్ టవర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను చదును చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. జాతరకు సంబంధించిన అన్ని పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. కార్పొరేషన్ డీఈ మసూద్, టీఆర్ఎస్ నాయకుడు సుధగోని కృష్ణాగౌడ్ తదితరులు పనులను పర్యవేక్షిస్తున్నారు. బల్దియా సిబ్బందికి తగు సూచనలు చేశారు.