ఆరు రోజులుగా చినుకు ఆగడం లేదు.. వరద ఉధృతి తగ్గడం లేదు.. దీంతో జనం ఇంటికే పరిమితమైంది. వానకు తడుస్తున్న పురాతన ఇండ్లు కూలుతున్నాయి. నిండిన చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంకల్లో వరద ప్రవాహం పెరుగుతున్నది. దీంతో ఆయా మారుమూల గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గాలివానకు రోడ్లపై వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇళ్ల నుంచి బయటకు రాని జనం
ఆరు రోజులుగా ఇళ్ల నుంచి జనం బయటకు రావడం లేదు. రేకొండలో రాయికుంట, గాండ్లకుంట, వెంకటాద్రి కుంట నిండాయి. గాగిరెడ్డిపల్లి బీసీ కాలనీలో తెల్లవారుజామున విద్యుత్ స్తంభం చెట్టుపై పడి తీగలు తెగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాగిరెడ్డిపల్లి నుంచి మౌటంపల్లెకు వెళ్లే నెరేళ్ల వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో వర్షానికి కూలిన ఇండ్లను తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఆర్ఐ పూదరి రాజు పరిశీలించారు. పలు గ్రామాల్లో పొలాలు నీటి మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎస్ఐ దాస సుధాకర్, ఎంపీడీవో నర్సయ్య గ్రామస్తులను కోరారు. వర్షాలకు కూలిన ఇండ్లను ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సర్పంచ్ పీచు లీల, ఎంపీటీసీ జమున పాల్గొన్నారు.
కూలుతున్న ఇండ్లు
వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో లోతట్టు గ్రామాల కాలనీల్లోకి వరద చేరింది. మండలంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మత్తడులు దుంకుతున్నాయి. కేశవపట్నం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అర్కండ్ల వాగు కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అర్కండ్ల-కన్నాపూర్ గ్రామాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాపూర్ గ్రామంలో గొర్ల లచ్చమ్మ, మొలంగూర్ గ్రామంలో గాజుల ఎల్లయ్య, అంబాల్‌పూర్ గ్రామంలో గోస్కుల అంజి ఇండ్లు కూలాయి. ధర్మారం ఊర చెరువు పూర్తిగా నిండి బ్యాక్ వాటర్ వరి పొలాలను ముంచెత్తింది. కూలిన ఇండ్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మండలంలోని ఎరడపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎరడపల్లి నుంచి ముత్తారం వ్యవసాయ విద్యుత్ అవసరాలకు వెళ్లే ట్రాన్స్ఫార్మర్కు చెందిన రెండు 11 కేవీ విద్యుత్ స్తంభాలు గాలి వానకు నేలకూలాయి. ఆ లైన్లో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు.
వరద ఉధృతిని పరిశీలించిన ఏసీపీ కరుణాకర్‌రావు
మండలంలోని పారువెళ్ల చెరువు, గన్నేరువరం ఊర చెరువు మత్తడి దుంకుతున్నాయి. వరద ఉధృతితో గన్నేరువరం నుంచి పొత్తూరు మీదుగా కరీంనగర్ వెళ్లే మార్గం బంద్ చేశారు. వరద ఉధృతిని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు పరిశీలించారు. వాహనదారులు ప్రవాహంలో మత్తడి దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిమ్మాపూర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ మామిడాల సురేందర్ ఉన్నారు.
రాకపోకలు బంద్
వర్షాలతో జనజీవనం స్తంభించిపోతున్నది. పల్లెల్లో సైతం చెరువులు, కుంటలు, నిండి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అన్నారం, దేవంపల్లి, శ్రీనివాస్‌నగర్, కొండపల్కల, మద్దికుంట గ్రామాల్లోని చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. మంగళవారం రాత్రి గట్టుదుద్దెనపల్లి వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై చెట్టు నేలకొరిగి విద్యుత్ తీగలపై పడింది. సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. శ్రీనివాస్‌నగర్‌లో ఇండ్లల్లోకి వరద చేరింది. లింగాపూర్‌లో వేల్పుల రవి, తాల్ల కనుకయ్యతో పాటు లలితాపూర్లో పొలవేని లక్ష్మికి చెందిన ఇండ్లు కూలిపోయాయి. ఈదుల గట్టెపల్లి గ్రామ పంచాయతీ ఎదుట లోతట్టుగా ఉండడంతో వరద ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మత్తడి దుంకుతున్న పెద్దచెరువు
ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షానికి మానకొండూర్ పెద్దచెరువులోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో చెరువు జలకళను సంతరించుకున్నది. చెరువులో నీటిమట్టం పెరగడంతో బుధవారం నుంచి మత్తడి దుంకుతున్నది. మత్తడి వద్ద మత్స్యకారులతో పాటు గ్రామస్తులు చేపలు పడుతున్నారు.