ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆర్నకొండలో బుధవారం 143.5 మి. మీ వర్షపాతం నమోదైంది. చొప్పదండి పట్టణంలోని కుడిచెరువు మత్తడి దుంకుతుండడంతో గుమ్లాపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని రెడ్డి కాలనీలో ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రాగంపేటలోని పందివాగు నిండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్నకొండలోని ఐతమ్మ చెరువు నిండి వరద నీరంతా పొలాల్లో నిలిచింది. మండలంలో తహసీల్దార్ రజిత, సీఐ రవీందర్, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. మండలంలో ఇప్పటి వరకు 20 ఇండ్లు పాక్షికంగా కూలిపోయినట్లు తహసీల్దార్ రజిత తెలిపారు. వారికి తక్షణ సాయం అందజేసి, బంధువుల ఇండ్లకు పంపినట్లు పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ సూచించారు. పట్టణంలోని 4, 7, 11, 14వ వార్డుల్లో గల లోతట్టు ప్రాంతాల్లో ఆమె కలియ తిరిగారు. ఇండ్లలోకి నీరు వచ్చిన వారితో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని ఎక్స్కవేటర్ సహాయంతో బయటకు పంపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపించేందుకు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వర్షంతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత కౌన్సిలర్, అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, నాయకులు నలుమాచు రామకృష్ణ, పెరుమండ్ల గంగయ్య, చేపూరి సత్యనారాయణగౌడ్ తదితరులు ఉన్నారు.
మండలంలో బుధవారం 171.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నారాయణపూర్ రిజర్వాయర్ మత్తడి దుంకుతున్నది. రిజర్వాయర్ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, లక్ష్మీదేవిపల్లి, గంగాధర వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇస్లాంపూర్ వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం పడగా, పోలీసులు, సర్పంచ్ ఆధ్వర్యంలో తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. గంగాధర రైల్వే గేట్ కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కురిక్యాల, ఉప్పరమల్యాల మధ్య, కాసారం గర్శకుర్తి గ్రామాల మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కొండాయపల్లి వద్ద రోడ్డు తెగిపోవడంతో కొండాయపల్లి, చెర్లపల్లి, ర్యాలపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపూర్ వద్ద రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పరమల్యాల, రంగరావుపల్లి గుండ్ల చెరువు, గర్శకుర్తి ఊర చెరువు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతున్నాయి. తాడిజెర్రిలో గుంటుకు రవీందర్, నాగిరెడ్డిపూర్‌లో ర్యాగల్ల లలిత, ఇస్లాంపూర్‌లో తాటి దేవయ్య, గోపాల్రావుపల్లిలో రాసూరి లింగయ్యకు చెందిన ఇండ్లు కూలి పోయాయి. కాసారంలో బత్తిని నారాయణ, గర్శకుర్తి చిప్ప రాజుకు చెందిన ఇంటి గోడలు కూలిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు పల్లెలు జల దిగ్భందమయ్యాయి. వెలిచాల నుంచి కొత్తపల్లికి వెళ్లేదారిలో రొడ్డాము వద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేణుగౌడ్ మంగళవారం రాత్రి కారులో వెలిచాల మీదుగా కరీంనగర్ వెళ్తున్న క్రమంలో రొడ్యాం మధ్యలోనే ఆగిపోవడంతో చేపలు పట్టేందుకు వచ్చిన జాలర్లు గమనించి కాపాడినట్లు తెలిసింది. నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయినట్లు సమాచారం అందగా కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ కాజ్వే వద్దకు చేరుకొని ఇరువైపులా ప్రమాద హెచ్చరిక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, రాకపోకలు బంద్ చేయించారు. రామడుగు శివారులోని వాగులో నీళ్లు వంతెనను ఆనుకొని వెళ్తున్నాయి. ఎస్ఐ అంజయ్య వాగు వద్దకు చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. వెలిచాలలో చించెరువు, పెద్దచెరువులు అలుగు దుంకుతున్నాయి. గుండి చెరువు మత్తడి దుంకెందుకు సిద్ధంగా ఉంది. గ్రామాల్లో వరద నీటిలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. మండలంలోని లక్ష్మీపూర్‌లో పాలమాకుల లక్ష్మి, గోపాల్‌రావుపేటకు చెందిన ఏగోలపు కొమురయ్య, శ్రీరాములపల్లికి చెందిన మాడిశెట్టి చంద్రయ్య, కొక్కెరకుంటకు చెందిన దామెర లక్ష్మి, గుండికి చెందిన చెరుకు లింగయ్య ఇండ్లు కూలిపోయినట్లు తహసీల్దార్ రాజ్‌కుమార్ తెలిపారు.