కార్పొరేషన్, జూలై 13: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దయింది. మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాలు, శివారు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని బల్దియా అధికారులు సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. నగరంలో కొనసాగుతున్న సహాయక చర్యలను మేయర్ వై సునీల్‌రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు పర్యవేక్షిస్తున్నారు. బల్దియా ఆధ్వర్యంలో 24 గంటలు డీఆర్ఎఫ్ బృందాలు, ఇంజినీరింగ్, పారిశుధ్య, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు మరో మూడు రెస్క్యు టీంలను అందుబాటులో ఉంచారు. వీరు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే, నగరపాలక సంస్థలో కాల్ సెంటర్ నంబర్ 0878-2200100 ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలకు అందించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. మురుగు కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోతే పారిశుధ్య సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. సహాయక చర్యలు అందించేందుకు 24 గంటలు మూడు షిఫ్టుల్లో ప్రతి షిఫ్టులో 15 మంది సిబ్బందిని ప్రత్యేక పరికరాలతో సిద్ధంగా ఉంచారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు శివారు లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ఈ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నారు. నగరంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల నుంచి కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన వరద నీటిని ఎక్స్కవేటర్ల సహాయంతో కాల్వలు తీయించి తొలగిస్తున్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్‌తో పాటు పారిశుధ్య, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు డివిజన్ల వారీగా పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, మెండి శ్రీలత-చంద్రశేఖర్, జంగిలి ఐలేందర్‌యాదవ్, ఎదుర్ల రాజశేఖర్, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, రవీందర్‌సింగ్ పర్యటించి వరద నీటిని తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నారు. కాగా, నగరంలోని రేకుర్తి, విద్యానగర్, సూర్యనగర్, అలకాపురికాలనీ, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించి వరదనీటి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు
వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని మేయర్ వై సునీల్‌రావు సూచించారు. నగరంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు డీఆర్ఎఫ్, 3 రెస్యూ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. శివారు, వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరద నీరు నిలిచి ఉండకుండా బృందాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో వరద నీటితో ఇబ్బందులు ఏర్పడితే బల్దియా హెల్ప్ లైన్ నంబర్ 14420, కాల్ సెంటర్ నంబర్ 0878-2200100కు సమాచారం అందించాలని కోరారు. అలాగే, వరద నీటి పరిస్థితిని సెల్ నంబర్ 98499 06694కు వాట్సాప్ ఫొటో, వీడియో ద్వారా సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు బల్దియా బృందాలను అప్రమత్తం చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు నిండడంతో షేకాబీకాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు కెనాల్ తూమును తెరిచి వరద నీటిని వాగులోకి మళ్లించారు. షేకాబీకాలనీ ప్రజలు లయన్స్ క్లబ్ కంటి దవాఖాన ప్రధాన రహదారి మీదుగా రాకపోకలు సాగించాలని 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
కొత్తపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. బైపాస్ రోడ్డులోని కల్వర్టుపై నుంచి వరద నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని నాగులమల్యాల, కొత్తకొండాపూర్, ఆసీఫ్‌నగర్, కమాన్‌పూర్ గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు గ్రామాల్లోని కల్వర్టులపై నుంచి వరద నీరు వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి పట్టణంలో నాలుగు ఇండ్లు, బద్దిపల్లి గ్రామంలో రెండు ఇండ్లు కూలిపోయాయి. కొత్తపల్లి చెరువు, శివారులోని కల్వర్టును మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్, ఎస్ఐ ఎల్లయ్యగౌడ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, గండు రాంబాబు, సత్యనారాయణరెడ్డి, ఎస్కే నజియాబాబా పరిశీలించారు.