రాయికల్ రూరల్,జులై 13: ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అధికారులు సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో యంత్రాంగానికి సహకరించాలని కోరారు. జగిత్యాలకు చెందిన ఎన్టీవి రిపోర్టర్ జమీర్ కారుతో సహ గల్లంతైన స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అధికారులతో కలిసి బుధవారం రాత్రి పరిశీలించారు. గాలింపు కోసం చేపడుతున్న చర్యలను అడిగితెలుసుకున్నారు. ఇక్కడ వరద ఉధృతి అధికంగా ఉన్నందునా తగిన జాగ్రత్తలు పాటిస్తూ గాలించాలని కోరారు. మంత్రి వెంట కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, సర్పంచ్ జక్కుల చంద్ర శేఖర్, జక్కుల ప్రసాద్, యువకులు పాల్గొన్నారు.
జమీర్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు
రాయికల్ మండలం రామాజీపేట్ వాగులో వరద ఉధృతికి మంగళవారం కొట్టుకుపోయిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం నుంచే సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో వెదికినా ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం భారీ క్రేన్‌తో గాలించారు. పెరుగుతున్న వరద ఉధృతితో అంతరాయం కలుగుతున్నా లెక్కచేయకుండా పది మంది గజ ఈత గాళ్లు గాలించారు. కారు కొట్టుకొని పోయిన ప్రాంతంలో వ్యవసాయ బావులు ఉన్నాయని, అందులో కారు పడి ఉంటుందని స్థానిక యువకులు, రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రామాజీపేట్, భూపతిపూర్ యువకులతో కలిసి మధ్యాహ్నం అంతా వర్షంలో తడుస్తూ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఎన్ని ప్రయాసాలకు ఓర్చుకోనైనా జమీర్ ఆచూకీ కనుగొంటామని ఎమ్మెల్యే తెలిపారు.