సిరిసిల్ల టౌన్, జూలై 13: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు వచ్చాయని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తీసుకొని బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకు అందించారని చెప్పారు. 2017 నుంచి ఇప్పటివరకు ఏటా విజయవంతంగా చీరల ఆర్డర్లు వచ్చాయన్నారు.
ఈసారి సుమారు 10రకాల రంగులతో 19రకాల డిజైన్లతో 190రకాల బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక నేతన్నలు తయారుచేసిన బతుకమ్మ చీరల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామని, రాబోయే బతుకమ్మ పండుగ నాటికి 18ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ చీరలు అందేలా మంత్రి కేటీఆర్ ప్రణాళికపరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమం త్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల నేతకార్మికులు జీవితకాలం రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ఏడి అశోక్‌రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్ వెల్దండి దేవదాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం, ఎస్ఎస్ఐ మ్యాక్స్ సంఘాల యజమానులు, నాయకులు తదితరులున్నారు.