వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ఐదు రోజులుగా దంచికొడుతున్నది. మంగళవారం రోజంతా కుండపోత పోసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం కాగా, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మోయతుమ్మెద, చిలుక, మోతె వాగు పొంగిపొర్లుతుండగా, ఇటు ఎల్ఎండీ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. మొత్తంగా 1,903 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కలెక్టర్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కూలిన ఇండ్లను పరిశీలిస్తూ బాధితులకు భరోసా ఇస్తూనే, అత్యవసర సాయానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. కాగా, దిగువ మానేరు పరీవాహక గోసంగి పల్లెలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు. ఇండ్లు దెబ్బతినడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, ప్రహరీలు, విద్యుత్ స్తంభాలను గుర్తించి, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. సీజనల్, డెంగీ ప్రబలకుండా చూడాలి. ఎల్ఎండీ రిజర్వాయర్ సమీపంలో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. దెబ్బతిన్న చెరువులు, రోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు నివేదించాలి. నష్టపోయిన వారికి రిలీఫ్ ఫండ్ అందించాలి.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ): వర్షాలు నాలుగు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. మంగళవారం రోజంతా కుండ పోతగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మోయతుమ్మెద వాగు పారుతుండడంతో ఎల్ఎండీకి వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం వరకు 1,903 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
చెరువులకు జలకళ.. జనజీవనం అస్తవ్యస్తం వరుస వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ రాగా, జన జీవనం మాత్రం అస్తవ్యస్తమైంది. మానకొండూర్ పెద్ద చెరువుకు బుంగ పడింది. పరిస్థితిని సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, స్థానిక జడ్పీటీసీ సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ పరిశీలించి బుంగను త్వరగా పూడ్చి వేయాలని అధికారులను ఆదేశించారు. మానకొండూర్ మండలంలోని అన్నారం, కొండపల్కల, శ్రీనివాసనగర్, దేవంపల్లి గ్రామాల్లోని పలు చెరువులు నిండుకుండల్లా మారాయి. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది.
ముత్తారం గ్రామంలోని రాజసముద్రం చెరువు మత్తడి పడుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఆరు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్‌లో ఎల్ఎండీ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో ఉంటున్న గోసంగి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. ఇక్కడి ఇండ్లు దెబ్బతినడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారును ఆదేశించారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి చెక్ డ్యాం మత్తడి పడుతోంది. ఒగులాపూర్ వద్ద ఎల్లమ్మవాగు, రామంచ వద్ద మోయతుమ్మెద వాగు పారుతోంది. ఒగులాపూర్, గునుకులపల్లి, రామంచ గ్రామాల్లో ఇండ్లు దెబ్బతిన్నాయి. హుజూరాబాద్ పట్టణ సమీపంలోని చిలుక వాగులో వరద పెరిగింది. వీణవంక మండలం వీణవంక, రామకృష్ణాపూర్ గ్రామాల్లోని చెక్‌డ్యాంలు మత్తడి పడుతున్నాయి. లస్మక్కపల్లి, రామకృష్ణాపూర్ చెక్‌డ్యాంలకు ఇరువైపుల గండ్లు పడ్డాయి. రామడుగు మండలంలోని మోతె వాగు పారుతోంది. వెలిచాల చెరువు మత్తడి పడుతోంది. వెలిచాల-కొత్తపల్లి మధ్యన ఉన్న రోడ్డు డ్యాం ఉధృతంగా పారుతోంది.
కొత్తపల్లి చెరువు మత్తడి పడుతోంది. ఈ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పర్యటించి రోడ్లపై, నివాస గృహాలను ఆనుకుని ఉన్న నీటిని మళ్లించాలని అధికారులను ఆదేశించారు. చొప్పదండి కుడి చెరువు మత్తడి పడుతోంది. కరీంనగర్‌లోని అలకాపురి, రాంపూర్ రోడ్లు మునిగి పోయాయి. ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద కూడా రోడ్లు మీదుగా వరద విపరీతంగా ప్రవహిస్తోంది. ఇటు ఎన్టీఆర్ విగ్రహం వద్ద, రాంపూర్ ప్రధాన రోడ్లపైకి వరద చేరుకుం ది. కాగా, వర్షాలపై మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, మం గళవారం ఉదయం జిల్లాలో సగటున 8 మిల్లీ మీటర్ల వ ర్షం కురిసింది. అత్యధికంగా గంగాధరలో 14.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు యంత్రాంగం పేర్కొంది.