జగిత్యాల టౌన్, జూలై 12 : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గానకోకిల కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలిగేటి రాజేంద్రప్రసాద్ రూపొందించిన గీతార్థ చిత్రమాలిక గ్రంథాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రంథ రూపకర్తలను అభినందించారు. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, భగవద్గీతలోని 700 శ్లోకాలకు గాను 55 ముఖ్యమైన శ్లోకాలను తీసుకొని ఆ శ్లోకాలకు సంబంధించిన భావాన్ని ఊహా చిత్రాలుగా వేయించి అద్భుతంగా ఈ గ్రంథాన్ని రూపొందించామన్నారు. సామాన్య ప్రజలకు ప్రత్యేకించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేవిధంగా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దామన్నారు. తెలుగు భాషతో పాటు హిందీ, ఆంగ్లంలో కూడా శ్లోకాలకు అర్థాన్ని ముద్రించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ చిత్రకారుడు మేరుగు రాజేంద్రప్రసాద్, గానకోకిల కళానికేతన్ ఉపాధ్యక్షుడు ఎలగందుల రవి తదితరులు పాల్గొన్నారు.