ధర్మపురి, జూలై12 : భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొప్పుల ఈ శ్వర్ ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత ఐదారు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్నదని చెప్పారు. గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదలడంతో భారీగా వరద వచ్చే అవకాశముందన్నారు..తీర ప్రాంత ప్రజలను అప్రమత్త పరచాలన్నారు. అలాగే, నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న చెరువుల పట్ల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. వర్షపాత వివరాలు, పంటలు, ఆస్తి నష్టం, తదితర విషయాలపై ఆరా తీశారు. అలాగే, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను గుర్తించి అత్యవసరమైతే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు భవనాలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, లైన్‌మన్ సహా అందరూ క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే భోజన సౌకర్యం కల్పించాలన్నారు. నియోజకవర్గంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్‌శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.