రాయికల్ రూరల్, జూలై 12 : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రులో చిక్కుకున్న 9 మంది కౌలు రైతులు క్షేమంగా ఇంటికి చేరారు. కాగా, వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించడంతో వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కాగా, గోదావరినది రెండుగా చీలిన చోట ఎత్తయిన ప్రాంతంలో కుర్రు ఉంది. ఈ ప్రాంతం సుమారుగా 150 ఎకరాలకు పైగా ఉంటుంది. బోర్నపల్లికి చెందిన 9 మంది రైతులు కొన్ని సంవత్సరాలుగా కుర్రులో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.
వొల్లె రఘునాథ్, రంగారావు, దేవిధాన్, సాహెబ్రావు, విజయ్, కార్తీక్, సత్యభామ, సునిత, విజయంతి వంట సామగ్రిని తీసుకొని వారం రోజుల క్రితం బోర్నపల్లి నుంచి కుర్రుకు బయల్దేరారు. నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద పోటెత్తింది. ఇంకా నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆందోళనకు గురయ్యారు. ఇలానే వర్షాలు కురిస్తే వరద పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమను రక్షించాలని రైతులు బోర్నపల్లి గ్రామస్తులు, అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు.
పరిస్థితిని ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలుపగా మంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వివరించారు. స్పందించిన సీఎస్ రైతులను రక్షించి వారిని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే హెలీకాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చేలా చర్యలు చేపడుతామన్నారు. ఘటనా స్థలంలో ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, ఉన్నతాధికారులు రాత్రి వరకు గోదావరి వద్దనే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు. తమకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరకులు ఉన్నాయని, ఇప్పటివరకు క్షేమంగా ఉన్నామని రైతులు కలెక్టర్‌కు ఫోన్లో వివరించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు సాయంత్రం 6 గంటలకు నలుగురు వచ్చారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి రెండు బోట్ల ద్వారా వారిని రాత్రి 9:15 గంటల వరకు క్షేమంగా గ్రామానికి చేర్చారు. కౌలు రైతులు సురక్షితంగా ఇళ్లకు చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.