చిగురుమామిడి, జూలై 12: కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో గొర్రెలు, మేకలను దొంగతనం చేసిన తొమ్మిది మందిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ర్వు తెలిపారు. మంగళవారం చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్, కోనేటి కిరణ్, సూర రాజు, పందిపల్లి ప్రశాంత్, శివరాత్రి రంజిత్, శివరాత్రి అనిల్, సుర సంపత్, దున్న పోతుల వెంకటేశ్, శివరాత్రి అనిల్ అలియాస్ గిరి జల్సాలకు అలవాటు పడ్డారు.
తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా మానకొండూర్, ఎల్కతుర్తి, కోహెడ, చిగురుమామిడి, అక్కన్నపేట, మద్దూరు తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో గొర్రెలు, మేకలను దొంగిలించి సంతలో అమ్ముకుని వచ్చిన సొమ్మును పంచుకునేవారు. దొంగతనంలో సంపత్ ఎర్టిగా కారు, కిరణ్ ఇండిగో కారు, రాజు ఇండికా కారును ఉపయోగించారు. గొట్లమిట్ట మద్దూరులో 11 మేకలను కార్లలో వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా సంతలో అమ్మేందుకు కరీంనగర్ వైపు వెళ్తుండగా చిగురు మామిడి బస్టాండ్ సమీపంలో ఎస్ఐ దాస సుధాకర్ పట్టుకున్నారు. వారి నుంచి రూ.లక్షా 700, 11 మేకలు, మూడు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన చిగురుమామిడి ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ పరశురామ్, రాజశేఖర్, మురళి, ఓదయ్య సిబ్బందిని ఏసీపీ కరుణాకర్‌రావు అభినందించారు. ఈ సమావేశంలో తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.