ధర్మారం, జూలై 12: ఎస్సీ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో భారీ వర్షంలోనే ఆయన పర్యటించారు. జిల్లా ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఎస్సీ మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆర్థికం గా ఎంతో వెనుకబడిన మహిళల కోసం ప్రత్యేకంగా కుట్టు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. మహిళలు పట్టుదలతో శిక్షణను పూర్తి చేసుకుని నిష్ణాతులు కావాలని ఆయన సూచించారు. వివిధ డిజైన్లలో వస్ర్తాలను కుట్టడంలో తర్ఫీదు పొందితే సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే అవకాశం కల్పిస్తామని మంత్రి ఈశ్వర్ హామీ ఇచ్చారు. అందుకు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సంఘంగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రెడీమెడ్ దుస్తులు కూడా కుట్టేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన అభయమిచ్చారు. స్వయం ఉపాధికి కోసం రుణా లు ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కూరగాయల పెంపకం, ఇతర యూనిట్లు ఎంచుకుంటే అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.
జగిత్యాల జిల్లాలో విజయవంతంమైన ‘సహజ’ ఉత్పత్తులతో అక్కడి మహిళలు ఎంతో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని, అదే తరహాలో‘ సహజ’ ఉత్పత్తుల తయారీకి ముందుకు వస్తే పెద్దపల్లి జిల్లాలో మల్లాపూర్ను మోడల్‌గా తీసుకుని వారి కి శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని ఆయన వివరించారు. అందుకు మండల స్థాయి అధికారులు చొరవ చూపాలని ఆయన సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 45 రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. జ్యూట్ వస్తువులకు, అల్లికలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వాటి తయారీలో శిక్షణ పొందితే ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని, ఆ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు. మల్లాపూర్ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 36 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రిని సర్పంచ్, మహిళలు సన్మానించారు. ఈ సమావేశానికి సర్పంచ్ గంధం వరలక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, స్తానిక ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, ఎంపీడీవో బీ జయశీల, ఆర్బీఎస్ మండల కన్వీనర్ పాకాల రాజయ్య, సీపీ కార్యదర్శి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దొనికెని తిరుపతి, మల్లాపూర్ గ్రామాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి సల్వాజి మాధవరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎండీ బాబా, కటికెనపల్లి ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు తాళ్ల మల్లేశం, భూక్యా చంద్రా నాయక్, చేనెల్లి సాయికుమార్, నాయకులు, కుట్టు మిషన్ శిక్షణ సంస్థ సమన్వయకర్తలు జ్యో తి, అపర్ణ మహిళలు తదితరులు పాల్గొన్నారు.