వేములవాడ, జూలై 12: భారీగా వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లల్లో ఎవరూ ఉండకూడదని మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు కోరారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేసేందుకుగానూ మంగళవారం ఆయన అంబేద్కర్‌నగర్, సంజీవయ్యనగర్, మోచివాడలో ఇంటింటికీ తిరిగారు. పాత ఇం డ్లల్లో ఉండవద్దని, కూలిపోయే దశలో ఇండ్లను ఖాళీ చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ప్రణాళికాధికారి శ్రీధర్, సిబ్బంది శ్రీధర్, మెప్మా బాబాయ్ ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్
భారీవర్షాల నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చైర్పర్సన్ మాధవి, కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. మున్సి పల్ పరిధిలోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 08723 237999, టోల్‌ఫ్రీ నంబర్ 14420కి కూడా ఫిర్యాదు చేసి సమస్యలను చెప్పాలని కోరారు.
నిమ్మపల్లి మూలవాగుకు మత్తడి
కోనరావుపేట, జూలై 12: నిమ్మపల్లి మూలవాగు ప్రాజె క్టు మత్తడి దుంకింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం 19అడుగులతో ప్రాజెక్టు నిండుకుండలా మారిం ది. ప్రాజెక్టులో నుంచి అలుగు దుంకుతూ వట్టిమల్ల, బావుసాయిపేట, మామిడిపల్లి గ్రామాల మీదుగా ఉన్న మూలవాగులో ప్రవహిస్తున్నది. పలు గ్రామాల్లో ముసురులోనే రైతులు నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు.
సహకారం అందిస్తాం
వర్షాలకు ఇండ్లు కూలి ఇబ్బందిపడుతున్న వారు అధైర్యపడవద్దని.. వారికి ప్రభుత్వ పక్షాన సహకారం అందిస్తామని తహసీల్దార్ జయంత్‌కుమార్ పేర్కొన్నారు. వెంకటాపూర్‌లో వర్షాలకు కూలిన ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇక్కడ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మామిండ్ల తిరుపతిబాబు, వీఆర్వో ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
శిథిలావస్థలో ఇండ్లల్లో ఉండవద్దు
ఎల్లారెడ్డిపేట, జూలై 12: శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండవద్దని సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి గ్రామస్తులకు సూచించారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, పాత మట్టి గోడలను కూల్చివేయించారు. ఇక్కడ కార్యదర్శి ప్రవీణ్, ఉప సర్పంచ్ రజిత, వార్డు సభ్యులు బాలకృష్ణ, శ్రీనివాస్, దేవేందర్ ఉన్నారు.
నక్కవాగు ప్రవాహం పరిశీలన
వేములవాడ రూరల్, జూలై 12: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలోని నక్కవాగు ప్రవాహాన్ని డీస్పీ నాగేంద్రచారి మంగళవారం పరిశీలించారు. చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లవద్దని ఆయన సూచించారు. నక్కవాగు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున రాకపోకలు చేపట్టవద్దని కోరారు. ఆయన వెంట సీఐ బన్సీలాల్, ఎస్ఐ నాగరాజు ఉన్నారు.
ఇల్లంతకుంటలో..
ఇల్లంతకుంట, జూలై 12: పెద్దలింగాపూర్ శివారులోని ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో మంగళవారం రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చందుర్తిలో..
చందుర్తి, జూలై 12: రామన్నపేట చెరువును ఇన్చార్జి తహసీల్దార్ గోపాల్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సనుగుల ఎర్ర చెరువు, పటేల్ చెరువు మత్తడి దుంకింది. ఎన్గల్లోని ఊర చెరవు నిండుకుండను తలపిస్తున్నది. అనంతపల్లిలో పత్తి చేను నీట మునిగింది. మండలవ్యాప్తంగా 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇన్చార్జి తహసీల్దార్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం సైతం భారీగా వర్షం కురిసింది. గత నాలుగు రోజుల నుంచి ముసురుతో వానపడడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉన్నవారిని ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించి ఆశ్రయం కల్పించారు.