కార్పొరేషన్, జూలై 12: జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళవారం ఉదయం నుంచే వర్షం పడగా నగరంలో నిత్యం రద్దీగా ఉండే టవర్సర్కిల్ ప్రాంతం వెలవెలబోయింది. గత వానకాలంలో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో మురుగు కాల్వలను అభివృద్ధి చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో అదనంగా కాల్వలను నిర్మించడంతో వరద నీరంతా సాఫీగా వెళ్తున్నది. అయితే, శివారు ప్రాంతాలైన రేకుర్తి, విద్యానగర్, రాంచంద్రాపూర్ కాలనీ, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలోని ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని తరలించేందుకు బల్దియా అధికారులు తాత్కాలికంగా కాల్వలు ఏర్పాటు చేయించారు. మరో రెండు రోజుల పాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నగరపాలక సంస్థలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు డీఆర్ఎఫ్ బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచారు. నగరంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా, నీరు నిలిచినా వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలన
కొత్తపల్లి, జూలై 12: పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో నివాసం ఉండేవారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఆయన మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. 7వ వార్డులో కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటిని సిబ్బందితో తొలగించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు. కాగా, వర్షానికి కొత్తపల్లి చెరువు మత్తడి దుంకుతున్నది. చెరువులో మత్స్యకారులు చేపలు పడుతున్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 12: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్, నగునూర్, చెర్లభూత్కూర్, ఎలబోతారం, ఇరుకుల్ల, గోపాల్పూర్, మొగ్దుంపూర్లోని చెరువులు, కుంటలు వరద నీటితో నిండాయి. చామనపల్లిలోని అప్పన్న చెరువు, చెర్లభూత్కూర్లోని కొత్త చెరువు, ఊర చెరువు మత్తడి దుంకుతున్నాయి. చేగుర్తి గ్రామానికి ఇరువైపులా ఉన్న మానేరు, గుండి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మొగ్దుంపూర్ గ్రామంలో వరద నీరు సక్రమంగా వెళ్లేలా సర్పంచ్ జక్కం నర్సయ్య, ఉపసర్పంచ్ కుక్కట్ల తిరుపతి యాదవ్ చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.