శంకరపట్నం, జూలై 12: ఒడిశా, ఉత్తరాంధ్రలో ఏర్పడిన తుఫాన్ అల్ప పీడనంగా మారడంతో మండల వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకొని ఆగకుండా వర్షం పడుతున్నది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. కల్వల ప్రాజెక్టు జలకళతో ఉట్టి పడుతున్నది. ముత్తారం రామసముద్రం చెరువు, కేశవపట్నం పెద్ద చెరువు, ఎరడపల్లి, మెట్పల్లి, లింగాపూర్, కొత్తగట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. చెరువుల్లో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. సకాలంలో, సమృద్ధిగా వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాపూర్‌లో రాచమల్ల రాజమ్మ, రాచమల్ల ఎల్లమ్మ, బద్దిపడిగె దానమ్మ, ఇప్పలపల్లికి చెందిన వెంగల శ్రీనివాస్, అంబాల్‌పూర్‌కు చెందిన గోస్కుల రాజమ్మ, కేశవపట్నంకు చెందిన వడాల వెంకటలక్ష్మి ఇండ్లు పాక్షికంగా కూలాయి. కూలిన ఇండ్లను నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్దావర్ లక్ష్మారెడ్డి పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు. లోతట్టు కాలనీల ఇండ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పోలీసు, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
పెద్దచెరువును పరిశీలించిన జీవీఆర్
మానకొండూర్, జూలై 12: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మానకొండూర్ పెద్దచెరువులోకి వరదనీరు భారీగా వస్తున్నది. మంగళవారం సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పెద్దచెరువును పరిశీలించారు. చెరువు కట్టపై మత్తడికి సమీపంలో ఏర్పడిన పెద్ద గొయ్యిని జీవీఆర్ పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. గొయ్యిని వెంటనే పూడ్చాలని ఆదేశించారు. ఇక్కడ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి, నాయకుడు శాతరాజు యాదగిరి ఉన్నారు.
మత్తడి దుంకుతున్న చెరువులు
మానకొండూర్ రూరల్, జూలై 12: మండలంలోని దేవంపల్లి, శ్రీనివాస్‌నగర్, అన్నారం, జగ్గయ్యపల్లి, ముంజంపల్లి, ఈదుల గట్టెపల్లి, కొండపల్కల గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు జలమయమయ్యాయి. దేవంపల్లి, అన్నారం చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. జాలరులు చేపట వేట కొనసాగిస్తున్నారు. తహసీల్దార్, సీఐ కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వదలని వాన
చిగురుమామిడి, జూలై 12: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లోని కుంటలు, చెరువులు జలకళలను సంతరించుకున్నాయి. మంగళవారం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. గునుకులపల్లె, రామంచ, ఓగులాపూర్ గ్రామాల్లో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, ఎస్ఐ దాస సుధాకర్ పలు గ్రామాలను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
గన్నేరువరం, జూలై 12 : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్టా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బావ్‌సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత ఇండ్ల లో ఉన్న ఉన్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, రైతులు కరెంటు మోటర్లను వినియోగించుకొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువుల కాపర్లు పశువులను లోతట్టు ప్రాంతాలకు తీసుకుపోకూడదన్నారు. అత్యవసరం అనుకొంటే తప్ప ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. గ్రామంలో చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదముంటే వెంటనే ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.