కలెక్టరేట్ (కరీంనగర్), జూన్ 21: యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవారం కరీంనగరంలో పర్యటించిన ఆయన, జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో 7 కోట్లతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠకులనుద్దేశించి ప్రసంగించారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే పరామవధి కావద్దని ఉద్బోధించారు. దేశంలో 143 కోట్ల మంది ఉంటే 59 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాకు 6 లక్షల జాబ్స్ ఉన్నాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారందరికీ జాబ్స్ రావని స్పష్టం చేశారు. అయితే, రానివారు నిరాశ చెందకుండా ప్రైవేట్ సెక్టార్‌లోనూ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అనేక మంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చినవారేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
దేశంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సాంకేతికాధార వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతమైన బెల్లంపల్లికి చెందిన ఇద్దరు యువకులు ఇతరులపై ఆధారపడకుండా ఐటీ కంపెనీని స్థాపించి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఉదహరించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కంపెనీలను ప్రభుత్వం కరీంనగర్ లాంటి పట్టణాలకు సైతం తీసుకువచ్చిందని చెప్పారు. వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసినప్పుడే ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమవుతున్నదన్నారు. దురదృష్టవశాత్తు దేశంలో యువతను విభిన్నమైన ఆలోచనల దిశగా తీసుకెళ్లేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణలో మాత్రం విద్యార్థుల ను ఇన్నోవేటర్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుసాగుతున్నామని స్పష్టం చేశారు.
సాధిస్తామనే నమ్మకం ఉన్నప్పుడే గెలుపు మన సొంతమవుతుందని చెప్పారు. కరీంనగర్ యువత అన్నింటా ముందుంటూ రాష్ర్టానికే స్ఫూర్తిదాయకంగా నిలువాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ను సన్మానించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, సున్నితంగా వారిస్తూ వారినే సన్మానించారు. రాబోయే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సీపీ ఎల్ సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఏ నాలాలో చూసినా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, పరుపులు, మెత్తల వంటివి కనిపిస్తున్నయ్. ఈ విషయంలో ప్రజలు తమ బాధ్యతను విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ ముప్పును తప్పించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. రాబోయే తరానికి పరిశుభ్రత ఆవశ్యకతను తెలుపాలి. ఇటీవల సిద్దిపేటలో చూసిన తర్వాత ప్రతి మున్సిపల్ పరిధిలో స్వచ్ఛబడిని ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చినం. ఆ మేరకు ఇప్పటికే 79 కోట్లు కేటాయించినం. సిద్దిపేటలో దీప్తి అనే కౌన్సిలర్ నడుపుతున్న స్వచ్ఛ బడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు, ఇతర మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ముందుకు రావాలి. అంతేకాదు, పరిశుభ్రత ప్రక్రియ ముందుగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఇళ్ల నుంచే మొదలు కావాలి. ప్రతి శనివారం రీ థింకింగ్ డే నిర్వహించుకోవాలి. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధిస్తం. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టం ప్రారంభించుకోవడం సంతోష కరం. ఈ తరహా విధానం కరీంనగర్లో మొదలు పెట్టడం అభినందనీయం.
– కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్