కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 14 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు వ్యవసాయ, ఫార్మసీ, డిగ్రీ, ఐటీ ఐ కళాశాలలు, కోచింగ్ సెంటర్లతో విద్యా నిలయంగా నిలుస్తున్నది. ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నాలుగు ప్రభు త్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. మరోవైపు పదుల సంఖ్యలో ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలతోపాటు వ్యవసాయ కళాశాలలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యతోపాటు ఇంటర్ విద్యలోనూ పలు విద్యాసంస్థల జా తీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ విద్యారంగంలో తమదైన ముద్ర వేసుకుంటున్నాయి.
అలాగే, ఇక్కడి విద్యాసంస్థలు తమ స్కూళ్లలో స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నాయి. మొత్తంగా మంచి విద్యతోపాటు పార్ట్ టైం ఉద్యోగాలు సైతం చేసుకునేందుకు అపార అవకాశాలున్నాయి. ప్రైవేట్ సంస్థలతోపాటు కొత్త కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇలా అన్నింటికీ కరీంనగర్ కేరాఫ్‌లా నిలుస్తుండడం, ఇక్కడ తక్కువ ఖర్చు తో నాణ్యమైన విద్య అందుతుండడం, అపారమైన అవకాశాలు ఉండడంతో చుట్టుపక్కల జిల్లాల వాసులు ఇక్కడ చదువు కునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి విద్యాసంస్థలు, వసతి గృహాల్లో నాణ్యమైన భోజన వసతులతో పాటు, వసతి కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు.