కరీంనగర్ కలెక్టరేట్, జూలై 5 : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదనే విమర్శలున్నాయి. మహిళలు కోటీశ్వరులవడం దేవుడెరుగు కానీ, వారి ఆదాయమార్గాలు మాత్రం మూతబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్లు సక్రమంగా చెల్లించడం లేదనే అపవాదు ఉండగా, శాశ్వత ఆదాయానికి కూడా గండి కొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల సంక్షేమం, వారి ఆర్థిక అభ్యున్నతి, మహిళా సంఘాల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో దశాబ్ధంన్నర కిత్రం కరీంనగర సమీపంలో భారీ గోదాం నిర్మించారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ గోదాంలో సమీపంలోని రైస్‌మిల్లుల యజమానులు తాము సేకరించిన ధాన్యాన్ని, అలాగే పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లుల నుంచి సేకరించే బియ్యాన్ని నిల్వ చేసేవారు. దీని ద్వారా జిల్లా సమాఖ్యకు ప్రతి నెలా 1.50 లక్షలకు పైగా ఆదాయం రాగా, ఈ మొత్తాన్ని మహిళా సంఘాలకు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలకు వినియోగిచేవారు.
అయితే, ఈ గోదాంపై నిర్లక్ష్యం కొనసాగుతుండగా, ఏడాదిన్నరగా ఖాళీగానే ఉంటున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని మార్కెటింగ్ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది ఒత్తిడి మూలంగా, గోదాంను అద్దెకు తీసుకున్న యజమానులు ఖాళీ చేసినట్టు తెలుస్తున్నది. గోదాం అద్దె పెంచేందుకు స్వచ్ఛందంగా ముందు కు వచ్చినా, పర్యవేక్షణ సిబ్బంది మాత్రం కొర్రీ లు పెట్టడంతో వెనుకడుగేసినట్టు తెలిసింది. సమీపంలోని మిల్లర్లతో పాటు వ్యాపార సంస్థల నిర్వాహకులు అద్దె కోసం దరఖాస్తు చేసుకున్నా, అనేక షరతులతో వారు కూడా వెనుకకు తగ్గినట్టు తెలుస్తున్నది. దీంతో నాటి నుంచి నేటి వరకు ఆ గోదాం ఖాళీగానే ఉంటుండగా, నెలకు లక్షన్నర దాకా అద్దె కోల్పోవాల్సి వస్తున్నది.
అలాగే, గోదాం వినియోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నది. నిర్వహణపై కనీస పట్టింపులేకపోవడంతో పరిసరాల్లో చెట్లు పెరిగడంతోపాటు చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వానంగా మారింది. కొద్ది నెలల క్రితం ఈదురు గాలులకు పైకప్పు ధ్వంసం కాగా, లక్షలాది రూపాయలు వెచ్చించి సంబంధిత యంత్రాం గం మరమ్మతులు చేపట్టింది. పరిసరాలు శుభ్రం చేసి అద్దెకిచ్చేందుకు అంతా సిద్ధం చేసినా, గిట్టుబాటు కాకపోవడంతో పూర్వ స్థితిలోనే కొనసాగించాల్సి వస్తున్నది.
నెలనెలా లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోతున్నా, పట్టించుకునేవారు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయమై కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీధర్ మాట్లాడుతూ, గోదాంను అద్దెకిచ్చేందుకు సిద్ధం చేశామని, గోదాంలో చేసే నిల్వలకు అనుగుణంగా అద్దె చెల్లింపులకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. ఎవరికైనా అవసరముంటే నేరుగా వచ్చి తమను సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు.