‘కాళేశ్వరం’ రూపంలో ఎదురెక్కిన గోదావరి.. కర్షకుల కష్టాలను, కన్నీళ్లను దూరం చేస్తున్నది. అపర భగీరథుడు కేసీఆర్ అకుంఠిత దీక్షతో దిశను మార్చుకొని పరవళ్లు తొక్కింది. గలగలా తరలివస్తున్న జలాలు, ఉమ్మడి జిల్లాలో జలసవ్వడులు చేస్తున్నాయి.. నిండు వేసవిలోనూ వాగులు, వంకలు పారుతుండగా, చెరువులు మత్తళ్లు దుంకాయి.. భూగర్భజలాలు పైపైకి ఎగబాకుతున్నాయి.. ఫలితంగా నెర్రెలు వారిన భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సరికొత్త సృష్టించింది. ఉమ్మడి జిల్లా వేదికగా హరిత తెలంగాణ సంకల్పానికి పురుడు పోసింది. చరిత్రలో లేని విధంగా రెండేళ్ల నుంచి ప్రతి యాసంగిలోనూ తొమ్మిది లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగవుతున్నది. కల్పతరువులా మారిన ఈ ప్రాజెక్టుకు 2016 మే 2న శంకుస్థాపన చేయగా, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తయి 2019 జూన్ 21న అపర భగీరథుడు కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. ప్రాజెక్టు ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తి కానుండగా, సరికొత్త చరిత్రను లిఖించింది. అన్నదాతల బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది.
కరీంనగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లి నుంచి ఎగువ మానేరు వరకు రావడంతో ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టి పడుతున్నది. ఫలితంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండేళ్లుగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు కొనసాగగా శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానేరు డ్యాం ‘నిత్య కల్యాణం.. పచ్చతోరణం’ అన్నట్లుగా నీటితో కళకళలాడుతున్నాయి.
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎగువ, దిగువ భూములకు నీళ్లు అందాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎగువ మానేరు వరకు కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రాజెక్టులకు నీళ్లు రావడం.. మరోవైపు భూగర్భజలాలు పెరగడంతో మోటర్ల కింద భారీగా వరి సాగైంది. అలాగే మెజార్టీ చెరువుల కింద ఆయకట్టు పెరిగింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో రెండేళ్లుగా ప్రతి యాసంగిలోనూ 9 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్నది. నిజానికి 2014కు ముందు గణాంకాలు చూస్తే ఉమ్మడి జిల్లాలో యాసంగిలో సరాసరి మూడు లక్షల ఎకరాలకు మించి ఏనాడూ సాగు కాలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద కూడవెల్లి, పాల్వంచ వాగులపై ఎగువమానేరు ప్రాజెక్టును 1945-51 మధ్యలో నిజాం రాజులు నిర్మించారు. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పరిధిలో 13 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. సమైక్య నాయకులు ప్రాణహిత చేవేళ్ల నీళ్లు తెస్తామని చెప్పి శంకుస్థాపనకు మాత్రమే పరిమితం కాగా.. గతేడాది కాళేశ్వరం జలాలు ఎగువ మానేరును నింపాయి. ఈ ప్రాజెక్టు చరిత్రలోనే మండుటెండల్లో నీరు వచ్చి చేరడం అదే తొలిసారి.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ – రంగనాయకసాగర్ – మల్లన్న సాగర్-కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీటిని ఎత్తిపోయగా.. మల్లన్నసాగర్ పరిధిలోని తుక్కాపూర్ పంపుహౌస్ నుంచి కొండపోచమ్మ కెనాల్ ద్వారా వెళ్లే నీటిని గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి విడుదల చేశారు. అక్కడి నుంచి గంభీరావుపేట పరిధిలోని ఎగువమానేరు ప్రాజెక్టుకు వచ్చాయి. కూడవెల్లి వాగుపై ఉన్న 35 చెక్‌డ్యాంలను నింపుకొని మత్తడి దూకుతూ.. 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువమానేరుకు రావడం ఒక రికార్డు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు చరిత్రలోనే వేసవిలో నిండడం అదే మొదటిసారి.
ఇప్పటికే వాటర్హబ్లా మారిన ఉమ్మడి జిల్లాలో స్థానిక వాగులు, ఒర్రెల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టేందుకు పెద్ద మొత్తంలో చెక్ డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకటి.. రెండు కాదు.. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏక కాలంలో 846.38 కోట్లతో 114 చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది.
వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా.. పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తిచేసి.. నీటి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మొత్తం చెక్ డ్యాంలు పూర్తయితే.. రెండున్నర టీఎంసీల నీరు అందుబాటులోకి రావడమే కాదు, మానేరు, మోతె, పెద్దవాగు, హుస్సేన్‌మియా వంటి వాగులు సజీవంగా మారనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 4,526 చెరువులు ఉండగా.. వీటి పరిధిలో 2,29,993 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటి వరకు 80 శాతానికి పైగా చెరువులు పునరుద్ధరణ కాగా.. వీటి కింద 1,95,995 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నారు.ఉమ్మడి జిల్లా పూర్వం చెరువులకు పెట్టింది పేరు కాగా.. సమైక్య రాష్ట్రంలో మొత్తం కునారిల్లాయి. వీటిని పునరుద్ధరించిన ప్రభుత్వం, ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర, లోయర్ మానేరు డ్యాం, ఎస్సారెస్పీ పునర్జీవం, కాకతీయ కాలువ, ఎగువమానేరు ప్రాజెక్టుల ద్వారా నింపుతున్నది. తద్వారా నూటికి 75 శాతం చెరువుల్లో జలకళ ఉట్టి పడుతోంది. మండుటెండల్లోనూ మత్తడి దుంకుతున్నాయి.
అపరభగీరథుడు అంకురార్పణ చేసిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పురుడుపోసుకొని.. కాళేశ్వరం జలాలతో సాగు భూములను ముద్దాడుతున్నది. 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలను ఒడిసి పట్టుకున్న వరదకాలువ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలను నిజం చేస్తున్నది. నిన్నామొన్నటి వరకు నిస్తేజంగా మారిన చెరువులు.. మళ్లీ జీవం పోసుకోవడంతో అన్నదాత కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఎస్సారెస్పీ పునర్జీవం సాధ్యమా..? అంటూ విమర్శలు చేసిన గొంతులకు పొలాల మధ్య గలగలా పారుతున్న జలాలు, మత్తడి దూకుతున్న చెరువులు.. సముద్రాన్ని తలపిస్తున్న జీవనదిలా మారిన వరదకాలువే సమాధానం చెబుతున్నాయి. 122 కిలోమీటర్ల పొడవున్న వరదకాలువను ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద నాలుగు రిజర్వాయర్లుగా విభజించారు.
అందులో 0-34 కిలోమీటర్ వరకు ఒకటి, 34-73 కిలోమీటర్ వరకు రెండోది, 73-102 వరకు మూడోది, 102-122 వరకు నాలుగోది ఏర్పాటు చేశారు. నాలుగు ప్రాంతాల్లో హెడ్ రెగ్యులేటర్స్ ఏర్పాటు చేయడంతో వరదకాలువ 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలతో నిండిపోయింది. గణాంకాల ప్రకారం ఇందులో 1.5 టీఎంసీలు నిల్వ ఉంటుంది. 36 తూముల ద్వారా దిగువ, ఎగువ పరీవాహక ప్రాంతాలకు సాగునీరు అందుతున్నది. మరికొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలకు ఆమోద ముద్ర పడింది. పునర్జీవం ద్వారా కాలువ నుంచి పది నుంచి 15 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. లక్ష ఎకరాల వరకు సాగవుతున్నది.
మాది పోతుగల్. నాకు ఆరెకరాలు ఉంది. రెండు బోర్లు వేసిన. ఒక్క బోరులో నీళ్లు పడ్డా అవి ఏ మూలకు సరిపోలె. గత్యంతరం లేక ఇక్కడ భూమి పడావుపెట్టి గల్ఫ్ దేశం పోయిన. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ముస్తాబాద్ చెరువులోకి వస్తున్నాయని తెలుసుకొని గల్ఫ్ నుంచి తిరిగచ్చిన. ఇప్పుడు నీరు సమృద్ధిగా ఉంది. పని కూడా దొరుకుతుంది. గతంలో నీళ్లు లేక సరిగా పారక పంట దిగుబడి తక్కువ వచ్చేది. ఇప్పుడు దిగుబడి మంచిగనే ఉంది. ఎరువులకు, విత్తనాలకు, కరెంటుకు ఇబ్బందిలేదు, కేసీఆర్ సారు రైతులకు మంచిగనే చేస్తున్నడు. మల్లన్నసాగర్ ద్వారా నీళ్లు వచ్చినంక యాసంగిల ఆరెకరాల్లో వరి వేసిన. 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
– కొడుముంజ రవీందర్, రైతు, పోతుగల్ (ముస్తాబాద్ మండలం)
మాది చీకోడు. నాకు రెండెకరాలు ఉంది. మలన్నసాగర్ నుంచి గోదావరి నీళ్లు వచ్చినంక పంటలు బాగా పండుతున్నయి. మునుపు నీళ్లు లేక భూములన్నీ బీడుగనే ఉండేవి. వానకాలమే పంటలు ఏసేది. మా ఊరి చెరువులకు మల్లన్నసాగర్ కాల్వ నీరు వచ్చినంక మంచి పంట పండుతుంది. పండించిన వడ్లను ఊళ్లెనే సరారు కొంటున్నది. ఇప్పుడు రైతులకు మంచిగనే ఉంది. యాసంగిల నాకున్న రెండెకరాల్లో నాటేసిన. 48 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
– గొరిట్యాల నర్సింహులు, చీకోడు (ముస్తాబాద్ మండలం)
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు మా పంటలు వానవడితె పండినట్టు.. లేకుంటె ఎండినట్టు ఉండేది పరిస్థితి. నాకు బూరుగుపల్లిలో రెండెకరాల పొలం ఉంది. వానలు సక్కగ పడి మా ఊరి చెరువు నిండితె పంటల ఏసెటోన్ని. చెరువుల నీళ్లు లేకుంటె పంట పండుడు కష్టంగనే ఉండేది. మా ఊరి పక్క నుంచే వరదకాలువ పోతున్నది. వానకాలంల కూడా కాలువల నీళ్లు ఉండేటియి కాదు. చెరువుల నీళ్లు లేకపోతే వరద కాలువల గుంతలు తవ్వి అండ్ల నీళ్లు ఊరినకొద్దీ పొలానికి పెట్టెటోన్ని. ఒక్క వానకాలమే పంట ఏసెటోన్ని. యాసంగిల నీళ్లు లేక మొత్తం భూమి బీడు పెట్టెటోన్ని. సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి వరదకాలువకు నీళ్లు ఇడుసుడు సురువుజేసిన సంది మా జీవితాలల్ల వెలుగులు వచ్చినయ్. ప్రాజెక్టు వచ్చినంక వానలకోసం ఎదురు సూసుడు బంజేసినం. యేడాది పొద్దు వరదకాలువల నీళ్లు ఉండుడుతోని భరోసాగా పంటలు ఏత్తున్న. ఇప్పుడు నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు ఏత్తున్న. ఇప్పుడు కరెంటు, నీళ్లకు రందిలేదు, బిందాస్‌గా ఎవుసం జేసుకుంటున్న.
– గడ్డం స్వామి, బూరుగుపల్లి(గంగాధర)