ముస్తాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. అభ్యర్థులు ఉద్యోగ సన్నద్ధత కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్లో ఎంపీపీ జనగామ శరత్రావు ఏర్పాటు చేసిన ‘కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు జిల్లా అడ్మినిస్ట్రేషన్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని, సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కోరారు. ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని, శిక్షణతోపాటు ఒకపూట భోజనం పెడతామని, స్టడీ మెటీరియల్ను కూడా అందిస్తామని చెప్పారు. అనంతరం సెస్ డైరెక్టర్గా ఎన్నికైన కొమ్ము కొమ్ము బాలయ్యను ఉస్మానియా యూనివర్సిటీ పాలకవర్గ సభ్యుడు ఎస్విసీ ప్రకాశ్ సన్మానించారు.
ఇక్కడ జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్పర్సన్ శీలం జానాబాయి, సర్పంచు చాకలి రమేశ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, నాయకులు బత్తుల అంజయ్య, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, గాంధీ, రాంచంద్రం, సిరిసిల్లా రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.