WhatsApp status | గంగాధర, జులై 5: గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, పులి వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఆషాడ మాసంలో పట్టణం నుండి పల్లె వరకు ప్రజలు బోనాల పండుగలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని వివరించారు. వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన బోనాల పండుగ ఫొటోలను పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా గ్రూపులో పోస్ట్ చేశారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో ఉన్న ఫొటోను జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. కలెక్టర్ తమ పాఠశాల ఫొటోను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు.
కలెక్టర్ ఇస్తున్న స్ఫూర్తి భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా వెంకటయ్య పల్లె ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బోనాల పండుగ ఫొటోను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం పట్ల వెంకటాయపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.